Telugu Global
Andhra Pradesh

విగ్రహాలు, ఆగ్రహాలు.. ఏపీలో మళ్లీ మొదలైన రచ్చ..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపుతో గుంటూరులో రచ్చ మొదలైంది. ఈ విగ్రహం ఏర్పాటుకి అనుమతి లేదంటూ గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు.

విగ్రహాలు, ఆగ్రహాలు.. ఏపీలో మళ్లీ మొదలైన రచ్చ..
X

ఏపీలో విగ్రహాల తొలగింపు వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి ఎన్టీఆర్ విగ్రహమో, వైఎస్సార్ విగ్రహమో ఈ గొడవకు కారణం కాకపోవడం విశేషం. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తొలగింపుతో గుంటూరులో రచ్చ మొదలైంది. ఈ విగ్రహం ఏర్పాటుకి అనుమతి లేదంటూ గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. దీంతో కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు నగర పరిధిలో దాదాపు 300 విగ్రహాలు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తుంటాయి. వీటిలో 200 విగ్రహాలకు అసలు అనుమతే లేదు. అనధికారికంగా ఏర్పాటయ్యాయి, ఆ తర్వాత వాటి గురించి అడిగేవారు లేరు. కానీ ఇప్పుడు ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుతో మరోసారి వివాదం మొదలైంది. బాలు విగ్రహం ఏర్పాటుకి అనుమతి కోరుతూ రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగామని చెబుతున్నారు కళాదర్బార్‌ అనే సంస్థ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు. విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత తొలగించడం సరికాదని, మహా గాయకుడికి కార్పొరేషన్‌ అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. గుంటూరులో దాదాపు 200పైగా అనుమతి లేని విగ్రహాలున్నాయని, వాటి సంగతేంటని అంటున్నారు.

సందట్లో సడేమియా..

ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వ్యవహారం ఏపీలో కలకలం రేపింది. దీనిపై రాద్ధాంతం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎస్పీబాలు విగ్రహం తొలగింపుతో టీడీపీకి సంబంధం లేకపోయినా.. దీన్ని కూడా రాద్ధాంతం చేయాలనుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు. కళాకారులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో కళాకారులకు గౌరవం దక్కిందని, వైసీపీ రావడంతో వారిని పట్టించుకునేవారే లేరని అంటున్నారు. సినిమా టికెట్ల వ్యవహారంలో కూడా కళాకారులు సీఎం జగన్ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చిందని, కావాలనే కక్షతో కొంతమందిని జగన్ వేధిస్తున్నారని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. ఎస్పీ బాలు విగ్రహం తిరిగి గుంటూరులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

First Published:  4 Oct 2022 7:13 AM IST
Next Story