అరుదైన రుగ్మతకు చెక్ పెట్టి.. పదేళ్ల బాలుడిని కాపాడిన వైద్యులు - ఆరోగ్యశ్రీలో రూ.10 లక్షల వ్యయంతో ఉచిత వైద్యం
తమ కుమారుడు కోలుకోవడంతో ఆ తండ్రి ఆనందం పట్టలేకపోయాడు. గురువారం కేక్ తీసుకొచ్చి ఆస్పత్రిలో కట్ చేశాడు. స్వీట్లు తెచ్చి వైద్యులందరికీ పంచి వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
లక్షమందిలో ఒకరికి వచ్చే గులియన్ బెరి సిండ్రోమ్ అనే అరుదైన రుగ్మత బారిన పడి.. వెంటిలేటర్‌పై ప్రభుత్వాస్పత్రికి వచ్చిన పదేళ్ల బాలుడిని కాపాడారు గుంటూరు వైద్యులు. రూ.10 లక్షల వ్యయం అయ్యే వైద్యం ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించారు. బాలుడు సంపూర్ణంగా కోలుకోవడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
గులియన్ బెరి సిండ్రోమ్ అంటే..
గులియన్ బెరి సిండ్రోమ్ అనేది మన శరీర రోగ నిరోధక వ్యవస్థ మన నరాలపైనే దాడి చేసే అరుదైన రుగ్మత. రోగి చేతులు, కాళ్లలో బలహీనత ఏర్పడటం, జలదరింపు ఈ రుగ్మత మొదటి లక్షణాలు. ఇవి త్వరగా వ్యాప్తి చెందుతాయి. చివరికి రోగి శరీరం మొత్తాన్ని స్తంభింపజేస్తాయి.
అసలేం జరిగిందంటే..
బాలుడి స్వగ్రామం.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చాకలికుంట తండా. ఈ రుగ్మత బారిన పడిన బాలుడు వగ్యానాయక్ (10) ఐదో తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు మూడావత్ రాజానాయక్, మంగాబాయి.. రెండు నెలల క్రితం తమ కుమారుడికి ముఖంపై వాపు రావడం గుర్తించి నరసరావుపేట, గుంటూరులోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు.
కార్డియాక్ అరెస్ట్‌తో వెంటిలేటర్ పైకి..
దాదాపు రూ.10 లక్షల వ్యయంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించినా బాలుడు కోలుకోలేదు. రెండు సార్లు కార్డియాక్ అరెస్ట్ అయి.. ఆరోగ్యం మరింత క్షీణించింది. వెంటిలేటర్‌పై ఉన్న వగ్యానాయక్‌ని చివరికి ఈ నెల మూడో తేదీ అర్ధరాత్రి గుంటూరు ప్రభుత్వాస్పత్రి లోని న్యూరాలజీ విభాగానికి తీసుకొచ్చారు. తక్షణమే డ్యూటీలో ఉన్న పీజీ వైద్యులను అప్రమత్తం చేసిన న్యూరాలజీ విభాగం హెడ్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స ప్రారంభించినట్టు చెప్పారు. ఈ బాలుడికి అరుదుగా సంభవించే జీబీ సిండ్రోమ్ (గులియన్ బెరి సిండ్రోమ్) సంభవించినట్టు నిర్ధారించామన్నారు.
రోజుకు లక్ష రూపాయల విలువైన ఇంజక్షన్లు...
బాలుడిని కాపాడేందుకు రోజుకు లక్ష రూపాయల విలువైన ఇంజక్షన్లు చేశామని డాక్టర్ సుందరాచారి తెలిపారు. కేవలం ఇంజక్షన్లకే ఆ బాలుడికి రూ.6 లక్షల వ్యయం అయిందని వివరించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వ్యయం అయ్యే వైద్యాన్ని ఆ బాలుడికి ఉచితంగా అందించి కాపాడామని ఆయన వెల్లడించారు. బాలుడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని ఆయన వివరించారు.
తమ కుమారుడు కోలుకోవడంతో ఆ తండ్రి ఆనందం పట్టలేకపోయాడు. గురువారం కేక్ తీసుకొచ్చి ఆస్పత్రిలో కట్ చేశాడు. స్వీట్లు తెచ్చి వైద్యులందరికీ పంచి వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.