Telugu Global
Andhra Pradesh

నేతల అలసత్వాన్ని వెక్కిరిస్తున్న గుండ్లకమ్మ గేట్లు

నేతల అలసత్వాన్ని వెక్కిరిస్తున్న గుండ్లకమ్మ గేట్లు
X

2022 ఆగస్ట్-31న వరదలకు గుండ్లకమ్మ రిజర్వాయర్ మూడో గేటు కొట్టుకుపోయింది.

నిన్న(2023 డిసెంబర్-8) రెండోగేటు కొట్టుకుపోయింది.

తప్పెవరిది..?

"గత ప్రభుత్వం తప్పు చేసింది, మరమ్మతుల పేరుతో నిధులు స్వాహా చేసింది" -వైసీపీ

"మా ప్రభుత్వం తప్పు చేస్తే మీరు సరిచేయొచ్చు కదా, నాలుగున్నరేళ్లుగా మీరేం చేస్తున్నారు" -టీడీపీ

ఇదీ ఏపీలో జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే గుంతల రోడ్లపై ఏపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆ గుంతల రోడ్లు వేసింది టీడీపీయే తప్పంతా వారిదేనంటుంది వైసీపీ. కొన్నిచోట్ల వైసీపీ హయాంలో వేసిన రోడ్లు కూడా వర్షాలకు కొట్టుకుపోయాయి. ఇక్కడ తప్పు ప్రభుత్వాలదే కాదు, కాంట్రాక్టర్లది కూడా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాంట్రాక్టర్లు వారికి లాభం వచ్చేట్టుగానే పనులు చేస్తారు. దాని ఫలితమే అధ్వాన్నపు రోడ్లు. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు బురద చల్లుకున్నా.. దాని ఫలితం అనుభవించేది మాత్రం ఏపీ ప్రజలే. ఖర్చయ్యేది ప్రజల సొమ్మే. ఇప్పుడు రిజర్వాయర్ గేట్ల వ్యవహారం కూడా ఇలాగే తయారైంది. తప్పు మీదంటే మీదంటూ ఇరు వర్గాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి, అక్కడ నీళ్లు వృథాగా సముద్రంపాలవుతున్నాయి.

రిజర్వాయర్‌ గేట్ల మరమ్మతులు, వాటికి రంగులు వేసే నెపంతో టీడీపీ ప్రభుత్వం 2014 –2019లో పనులు చేయకుండానే రూ.3.57 కోట్లు కాజేసిందనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. సుందరీకరణ పేరుతో మరో రూ.1.58 కోట్లు నొక్కేశారని, అంతా కలిపి రూ.5.15 కోట్లు ప్రజా ధనం వృథా అయిందని అంటున్నారు వైసీపీ నేతలు. లెక్కలు ఇంత పక్కాగా చెబుతున్నారు, అక్కడ ఊడిపోయిన గేట్లు ఈ ఆరోపణలకు సాక్ష్యంగా మిగిలాయి. మరి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కదా. ప్రజా ధనాన్ని ఉద్దేశపూర్వకంగా వృథా చేసిన వారిని న్యాయ స్థానం ముందు దోషిగా నిలబెట్టాలి కదా. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా..? అనేది తేలాల్సి ఉంది.

గుండ్లకమ్మ మూడోగేటు కొట్టుకుపోయినప్పుడే ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేలుకోవాల్సి ఉంది. అప్పట్లో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు చేసి నీరు వృథా కాకుండా చూశామని, మరమ్మతులకోసం టెండర్లు పిలిస్తే సరిగ్గా నిన్న(శుక్రవారం) అవి ఖరారయ్యాయని, అవి ఖరారైన రోజే రెండో గేటు కొట్టుకుపోయిందని అంటున్నారు అధికారులు. ఇక్కడ కూడా స్టాప్ లాగ్ గేటు అమర్చి తాత్కాలికంగా నీటి ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. ఈ మధ్యలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరడం విశేషం.

First Published:  9 Dec 2023 9:54 AM IST
Next Story