కోనసీమలో కాల్పుల కలకలం.. రావులపాలెంలో ఉద్రిక్తత
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆర్దరాత్రి కాల్పుల సంఘటన జరిగింది. ఓ ఫైనాన్స్ వ్యాపారి, అతని కుమారుడిపై దుండగులు కాల్పులు జరిపారు.

ప్రశాంతంగా ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉలిక్కిపడింది. రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. సత్యనారాయణ రెడ్డి అనే ఫైనాన్స్ వ్యాపారిని బెదిరిస్తూ ఇద్దరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆయన కుమారుడు గుడిమెట్ల ఆదిత్యరెడ్డి వెంటనే అప్రమత్తమై వారిని ఎదుర్కోగా అతడిపై కూడా దుండగులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. అయితే గన్ మిస్ ఫైర్ కావడంతో ఆ ఇద్దరూ తమ చేతిలోని సంచీని వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సంచిలో రెండు నాటు బాంబులు, ఓ జామర్ ఉన్నట్టు తెలిసింది. ఆర్ధిక లావాదేవీలే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో ఆదిత్యరెడ్డి ఇంటికి చేరుకొని ఆయనను పరామర్శించారు. దుండగులు నాటు బాంబులు కూడా విసిరినట్టు అనధికారికంగా తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రావులపాలెంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.