కొడాలి నానికి మరో సారి మంత్రి పదవి? ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సీఎం జగన్ నిర్ణయం!
వైఎస్ జగన్ తొలి సారి ముఖ్యమంత్రి అయిన సమయంలోనే తన మంత్రి వర్గాన్ని రెండున్నర ఏళ్ల తర్వాత మారుస్తానని చెప్పారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో సారి మంత్రి వర్గ పునర్వవస్థీకరణ చేయనున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కొత్త టీమ్‌ను రెడీ చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీలో వరుసగా రెండో సారి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇందు కోసం పార్టీ పరంగా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తూనే.. తన టీమ్‌ను కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డారు.
వైఎస్ జగన్ తొలి సారి ముఖ్యమంత్రి అయిన సమయంలోనే తన మంత్రి వర్గాన్ని రెండున్నర ఏళ్ల తర్వాత మారుస్తానని చెప్పారు. తొలి సారి కేబినెట్‌లో స్థానం రాని వారికి రెండో సారి ఛాన్స్ ఇచ్చారు. అయితే తొలి మంత్రి వర్గంలో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి ఫైర్ బ్రాండ్ మంత్రులు ఉండేవారు. ప్రతిపక్షం నుంచి గానీ, చంద్రబాబు నుంచి కానీ ఎలాంటి ఆరోపణలు వచ్చినా వెంటనే వాళ్లు తిప్పికొట్టేవారు. స్వయంగా మంత్రులే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు సమాధానాలు చెప్తుండటంతో మీడియాలో కూడా బాగానే ప్రచారం జరిగేది.
రెండో మంత్రి వర్గంలో నాని, అనిల్ వంటి వారిని వైఎస్ జగన్ పక్కన పెట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వం తరపున ధీటుగా సమాధానం చెప్పేవారే కరువయ్యారు. మంత్రి పదవి పోయిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ పూర్తిగా నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. కొడాలి నానీ ఇప్పటికీ అదే దూకుడు కొనసాగిస్తున్నా.. మంత్రి పదవి లేకపోవడంతో మీడియాలో ఆయన మాటలకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. ఒక రకంగా వైసీపీ ప్రభుత్వాన్ని కరెక్ట్‌గా కౌంటర్ చేసే మంత్రులు లేరని స్వయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధపడుతున్నారు.
సీఎం వైఎస్ జగన్ కూడా ప్రభుత్వానికి మద్దతుగా, ప్రతిపక్షాలకు గట్టిగా కౌంటర్ ఇచ్చే మంత్రుల కొరతను పసిగట్టారు. త్వరలో ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. దానికి సంబంధించిన ఫలితాలు వచ్చిన తర్వాత మరోసారి మంత్రివర్గాన్ని పునర్వవస్థీకరించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో మంతనాలు సాగించినట్లు తెలుస్తున్నది.
ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కునే పేరున్న కొడాలి నానితో పాటు తోట త్రిమూర్తులుకు మంత్రివర్గంలో మరోసారి ఛాన్స్ ఇవ్వాలని దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. లోకేశ్ యువగళం, జనసేన పవన్ కల్యాణ్ తమ యాత్రల్లో చేసే విమర్శలకు వీరిద్దరు అయితేనే కరెక్ట్‌గా కౌంటర్ ఇవ్వగలరని.. వీరికి మంత్రి పదవులు ఇస్తే అది కచ్చితంగా ప్రభుత్వ వాయిస్ లాగా ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నారు. వీరిద్దరికీ దాదాపు మరోసారి మంత్రి పదవులు ఖాయమే అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అదే జరిగితే మరి మంత్రి పదవులు కోల్పోయే వారెవరు అనేది ఆసక్తికరంగా మారింది.