Telugu Global
Andhra Pradesh

తాడికొండ‌లో ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవికి అస‌మ్మ‌తి ఉక్క‌పోత‌

డొక్కా అడుగు పెట్టారంటేనే శ్రీదేవి సీటుకు ఎస‌రు పెట్టార‌ని తేలిపోయింద‌ని క్యాడ‌ర్ కూడా జారిపోతోంది. మాణిక్య‌వ‌ర‌ప్రసాద్ తో పంచాయితీ ఇక ముగియ‌క‌ముందే సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌తో తాడికొండ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా క‌త్తెర సురేష్‌కుమార్ రంగ‌ప్ర‌వేశం చేశారు.

తాడికొండ‌లో ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవికి అస‌మ్మ‌తి ఉక్క‌పోత‌
X

వైసీపీ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి తాడికొండ‌లో అన్నివైపుల నుంచి అస‌మ్మ‌తి వ‌ర్గం చుట్టుముడుతోంది. ఓ వైపు డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ క్యాడ‌ర్‌ని మొత్తం త‌న అజ‌మాయిషీలోకి తెచ్చుకుంటున్నారు. మ‌రోవైపు క‌త్తెర సురేష్‌కుమార్ నేతృత్వంలో మ‌రో వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేకి కంటిమీద కునుకు రానీయ‌డంలేదు. తాడికొండ నియోజకవర్గం వైసీపీ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌‌ను నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అధిష్టానంపై అల‌క‌బూనింది. ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదేమోనని ఆందోళన చెందుతున్నారు.

డొక్కా అడుగు పెట్టారంటేనే శ్రీదేవి సీటుకు ఎస‌రు పెట్టార‌ని తేలిపోయింద‌ని క్యాడ‌ర్ కూడా జారిపోతోంది. మాణిక్య‌వ‌ర‌ప్రసాద్ తో పంచాయితీ ఇక ముగియ‌క‌ముందే సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌తో తాడికొండ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా క‌త్తెర సురేష్‌కుమార్ రంగ‌ప్ర‌వేశం చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌లాల వారీ స‌మావేశాల‌లోనూ ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ వైసీపీ నేత‌లు ఆందోళ‌న చేశారు. టిడిపితో క‌లిసిపోయార‌ని, ప‌ద‌వులు అమ్ముకుంటున్నార‌ని, అవినీతి ప‌రాకాష్ట‌కు చేరింద‌ని శ్రీదేవిపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఈసారి సీటు ఇవ్వొద్దంటూ బ‌హిరంగంగానే కోరుతున్నారు. వివాదాస్ప‌ద ప‌నితీరు, వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా సుప‌రిచిత‌మైన తాడికొండ ఎమ్మెల్యే డాక్ట‌ర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి అస‌మ్మ‌తి కార‌ణంగా మ‌రోసారి వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు.

First Published:  2 Jan 2023 2:04 PM GMT
Next Story