కొత్త గవర్నర్ కి ఘన స్వాగతం.. 24న ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈనెల 24న బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
చత్తీస్ ఘడ్ కు బదిలీపై వెళ్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉదయం ఆత్మీయ వీడ్కోలు పలికిన ఏపీ సీఎం జగన్, సాయంత్రం కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్.. నూతన గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు.
సీఎం జగన్ వెంట చీప్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్, మంత్రి జోగి రమేష్, శాసనమండలి చైర్మన్ మోషేను రాజు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. గవర్నర్ కు పలువురు మంత్రులు, అధికారులను పరిచయం చేశారు సీఎం జగన్. ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గవర్నర్ దంపతులు విజయవాడలోని రాజ్ భవన్ కు బయలుదేరి వెళ్లారు.
24న ప్రమాణ స్వీకారం..
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈనెల 24న బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ న్యాయమూర్తిగా సేవలందించిన అబ్దుల్ నజీర్, గవర్నర్ గా రాజ్యాంగబద్ధ పదవిలోకి వస్తున్నారు. గవర్నర్ గా ఆయన ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ తో ప్రారంభం అవుతుండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్ కి మూడో గవర్నర్ గా వచ్చిన అబ్దుల్ నజీర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించి, ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ పొందారు. 1958 జనవరి 5న అప్పటి మైసూర్ రాష్ట్రం బెలువాయిలో జన్మించిన ఆయన, ముడిబిద్రిలోని మహావీర్ కాలేజీలో బీకాం గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మంగళూరులోని కొడియాల్ బైల్ లోని SDM కాలేజీ నుంచి ఎల్.ఎల్.బి. పట్టా అందుకున్నారు.
1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేయకుండానే, సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా ఎంపికైన మూడో జడ్జిగా నజీర్ గుర్తింపు పొందారు.