సర్ స్కూల్‌కు రాడు.. నిలదీస్తే దాడి అంటూ హైడ్రామా
గ్రామస్తులు అక్కడే ఉన్న విద్యార్థులను, మధ్యాహ్న భోజనం నిర్వాహకులను పిలిపించి ఆరా తీశారు. వారంతా కూడా షాకీర్ బాషా రోజూ ఆలస్యంగానే వస్తారని చెప్పారు. దాంతో గ్రామస్తులు పద్దతి మార్చుకోవాలని తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయాలని హితవు పలికారు.
నాడు-నేడు పేరుతో వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ స్కూళ్లకు పూర్వవైభవం తేవాలని ఏపీ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ ఏం లాభం..?. లక్షల లక్షలు జీతాలు తీసుకుంటూ కూడా కొందరు ఉపాధ్యాయులు సోమరులుగా మారి మొత్తం గురువులకే మచ్చ తెస్తున్నారు. మరికొందరు జీతాలను ఏం చేసుకోవాలో తెలియక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, చీట్టీ వ్యాపారాలు చేసుకుంటూ అసలైన వృత్తిని పార్ట్ టైం జాబ్‌గా మార్చేశారు.
అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం గోవిందవాడ ప్రభుత్వ స్కూల్‌లో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు రోజూ తనకు తోచిన టైంకు స్కూల్‌కు వచ్చేవాడు. ఇదేం పద్దతి సర్ అని నిలదీసిన గ్రామస్తులపై కేసు కూడా పెట్టేశాడు. చివరకు విచారణలో టీచర్ డ్రామాలు బయటపడ్డాయి.
గోవిందవాడ స్కూల్‌లో పనిచేస్తున్న షాకీర్‌బాషా రోజూ స్కూల్‌కు ఆలస్యంగా వస్తుంటారు. దాంతో గ్రామంలోని పెద్దలు, యువకులు ఏకమై మంగళవారం స్కూల్ వద్దకు వెళ్లి ఎదురుచూశారు. షాకీర్‌బాషా తీరిగ్గా 11 గంటలకు దర్జాగా వచ్చాడు. దాంతో గేటు దగ్గరే గ్రామస్తులు నిలదీశారు. ఉపాధ్యాయుడు అయి ఉండి మీరే ఇలా లేటుగా వస్తే ఇక పిల్లలకు ఏం చదువు చెబుతారంటూ నిలదీశారు. తాను రోజూ కరెక్ట్ టైం వస్తున్నా.. ఈరోజు మాత్రమే ఆలస్యం అయిందంటూ బుకాయించాడు టీచర్.
గ్రామస్తులు అక్కడే ఉన్న విద్యార్థులను, మధ్యాహ్న భోజనం నిర్వాహకులను పిలిపించి ఆరా తీశారు. వారంతా కూడా షాకీర్ బాషా రోజూ ఆలస్యంగానే వస్తారని చెప్పారు. దాంతో గ్రామస్తులు పద్దతి మార్చుకోవాలని తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయాలని హితవు పలికారు. ఇలా తనను అందరి ముందు నిలదీయడంతో రగిలిపోయిన షకీర్ బాషా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై గ్రామస్తులంతా దాడికి వచ్చారని, తిట్టారని, ఇలా అయితే అక్కడ తానెలా డ్యూటీ చేయాలంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామస్తులను స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. గ్రామస్తులంతా కూడా షకీర్ బాషాకు పద్దతిపాడు లేదని.. తాము కేవలం పద్దతి మార్చుకోవాలని కోరితే కేసు పెట్టడం ఏంటని పోలీసులకు వివరించారు. తమపై తప్పుడు కేసు పెట్టిన టీచర్ షాకీర్‌బాషాపై గ్రామస్తులు కూడా ఎదురు కేసు పెట్టారు.
రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు షాకీర్‌బాషా గురించి ఆరా తీశారు. ఇతడి పద్దతి సరిగా లేదని తేల్చారు. షాకీర్‌బాషా విధులకు సక్రమంగా హాజరుకావడం లేదంటూ ఇప్పటికే తమకు మూడు ఫిర్యాదు అందాయని ఎంఈవో తిమ్మప్ప వివరించారు. బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఇతడు మిస్‌యూజ్ చేస్తూ విధులకు డుమ్మా కొడుతున్న విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని పైఅధికారులకు నివేదిక ఇచ్చి చర్యలు తీసుకుంటామని ఎంఈవో చెప్పారు.