ఏపీలో ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ నియమితులయ్యారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం ఆమోదం తెలిపారు. గతంలో గవర్నర్ కోటాలో నియమితులైన చాదిపిరాళ్ల శివనాథరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ ల పదవీ కాలం జూన్ 20తో ముగిసింది. దీంతో ఆయా స్థానాల్లో రవిబాబు, పద్మశ్రీలను నియమించారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్‌చే నామినేట్ చేయబడిన రవిబాబు, పద్మశ్రీలను నియమిస్తూ జీవో విడుదల చేశారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా...
డాక్టర్ కుంభా రవిబాబు ప్రస్తుతం ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఉన్నారు. 1989 నుంచి 2004 వరకు ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2004లో ఎస్.కోట అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అరకు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రెండుసార్లు పోటీచేసి పరాజయం పాలయ్యారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా కుంభా రవిబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా గిరిజన ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటి శాశ్వత పరిష్కారానికి అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
మా సామాజిక వర్గంలో ఈ పదవి పొందిన తొలి మహిళ నేనే..
ఎమ్మెల్సీగా ఎన్నికైన మరో అభ్యర్థి కర్రి పద్మశ్రీ కాకినాడకు చెందినవారు. వాడబలిజ సామాజికవర్గానికి చెందిన ఆమె జాతీయ మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె భర్త నారాయణరావు వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ దేశంలో సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. తమ సామాజిక వర్గం నుంచి ఈ పదవిలో అడుగుపెట్టిన తొలి మహిళ తానేనని ఆమె తెలిపారు. ఈ అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.