గోరంట్ల మాధవ్‌కు వైసీపీ బంపరాఫర్ ?
న్యూడ్ వీడియోతో దేశవ్యాప్తంగా అటు జగన్ ప్రభుత్వం, ఇటు తెలుగువాళ్ల ప్రతిష్టను దిగజార్చిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో చర్య తీసుకోవడానికి జగన్ ప్రభుత్వం భయపడిందా?
న్యూడ్ వీడియోతో దేశవ్యాప్తంగా అటు జగన్ ప్రభుత్వం, ఇటు తెలుగువాళ్ల ప్రతిష్టను దిగజార్చిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో చర్య తీసుకోవడానికి జగన్ ప్రభుత్వం భయపడిందా? గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన విధానానికి, రెండు రోజులైనా గడవక ముందే ప్రెస్‌మీట్ పెట్టి మరీ గోరంట్ల మాధవ్ విషయంపై స్పందించిన తీరుకు చాలా తేడా ఉంది.
ఈ 48 గంటల్లో ఏం జరిగి ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గోరంట్ల మాధవ్ గతంలో ఒక పోలీస్ ఆఫీసర్, రాయలసీమలో బలమైన బీసీ కులాల్లో ఒకటైన కురుబ కులానికి చెందిన వ్యక్తి. కొన్ని చోట్ల కురబ కులస్తులు అందరూ గోరంట్ల మాధవ్‌కు మద్దతుగా మాట్లాడటం, కమ్మవాళ్ల కుట్రగా ప్రెస్‌మీట్లలో ప్రకటించడంతో మాధవ్‌ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్న జగన్ పార్టీ ఆలోచనకు బ్రేక్ వేసిందని చెబుతున్నారు. ఇష్యూ కమ్మవారి మీదికి వెళుతున్న సమయంలో, కురబలు కమ్మవారిపై కోపం పెంచుకుంటున్న తరుణంలో గోరంట్ల మాధవ్‌పై చర్య తీసుకోకపోవడమే తమకు రాజకీయంగా కలిసొస్తుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
కురబలు కమ్మవారిపై ద్వేషం పెంచుకుంటే, అది తెలుగుదేశం పార్టీకి నష్టమని, వైసీపీ రాజకీయంగా మంచిదే అనే లాభనష్టాల బేరీజులో మాధవ్ ఇష్యూను మరుగున పడేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ మాధవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, అసలే నోటి దురుసు గల మాధవ్ రెచ్చిపోతాడేమో అనే భయం కూడా వైసీపీ పెద్దల్లో కొందరికి వచ్చినట్లు ఉంది. ఆ మధ్య అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ల ఆడియో టేప్‌ల కలకలంలో వారిపై పార్టీపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇప్పుడు మాధవ్‌పై చర్య తీసుకుంటే ఇదే విషయాన్ని మాధవ్ ప్రెస్‌మీట్లలో ప్రశ్నిస్తే పరిస్థితి ఏంటని? టేపులు, వీడియోలు బయటకు రాకపోయినా, అదే తరహా కార్యకలాపాల్లో నిమగ్నమైన ఇంకొంతమంది ముఖ్యుల పేర్లు మాధవ్ బయటపెట్టి బద్నాం చేయోచ్చేమో అన్న ఆందోళన కూడా కొందరికి గుబులు పుట్టించిందట. దీంతో జగన్ కు కొంత సంమయనం పాటిస్తేనే మంచిదని నూరిపోశారని తెలుస్తోంది.
ఈసారి ఎమ్మెల్యేగా గోరంట్ల మాధవ్?
నగ్న వీడియోతో బద్నాం అయినా ప్రస్తుతం హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్‌కు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్టే ఇవ్వరని అందరూ ఊహిస్తున్న తరుణంలో ఆ పార్టీ అధిష్టానం ఆయనకు మరో బంపరాఫర్ ఇవ్వాలని నిర్ణయించిందట. ఈసారి గోరంట్ల మాధవ్‌ను ఎంపీగా కాకుండా, ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే నిర్ణయానికి వచ్చారట. ఈసారి ఆయన సొంత జిల్లా కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని చెబుతున్నారు. పత్తికొండ నియోజకవర్గం నుంచి గోరంట్ల మాధవ్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఎంపీ అనుచరులు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ మహిళకైనా అన్యాయం జరిగితే గన్ కన్నా జగన్ ముందుంటారని ఊదరగొట్టిన వైసీపీ నేతలకు ఈ వ్యవహారం మింగుడుపడటం లేదు.