ఏపీ నిరుద్యోగులకు అధికారికంగా గుడ్ న్యూస్..
గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసి 11 నెలల వ్యవధిలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశామని గుర్తు చేశారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. నోటిఫికేషన్లు లేటవుతాయి, ఎన్నికల తర్వాతే ఉద్యోగాల భర్తీ అంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు.
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నిన్న మొన్నటి వరకూ ఇది కేవలం ప్రచారంలో ఉన్న అంశమే అయినా ఇప్పుడిది అధికారికంగా మారింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, నోటిఫికేషన్లపై అధికారికంగా ప్రకటన చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా ఇతర పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్లు ఈనెలాఖరులోపు విడుదలవుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన, యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
పెరిగిన గ్రూప్-2 పోస్ట్ లు..
గతంలో ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చారని చెప్పినప్పుడు 500 వరకు గ్రూప్-2 పోస్ట్ లు భర్తీ అవుతాయనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పోస్ట్ ల సంఖ్య 900 వరకు ఉంటుందని తెలిపారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఊహించని శుభవార్తేనని చెప్పాలి. 100 పోస్ట్ లకు గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తారు. వీటితోపాటు డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నట్టు తెలిపారు సవాంగ్.
ఎన్నికలలోపు పరీక్షలు పూర్తి..
గ్రూప్1 ప్రిలిమ్స్ ఫిబ్రవరి లో నిర్వహించే అవకాశం ఉంది. గ్రూప్-2 ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా సార్వత్రిక ఎన్నికల లోపు పూర్తయ్యే అవకాశాలున్నాయి. నియామక ప్రక్రియ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టినా.. పరీక్షల ప్రక్రియ మాత్రం వాయిదా పడకుండా ఎన్నికల లోపే పూర్తి చేసే ప్రణాళికల్లో అధికారులు ఉన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్ల స్థానంలో ఈసారి ఒకే పేపర్ ఉంటుంది. గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసి 11 నెలల వ్యవధిలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశామని గుర్తు చేశారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. నోటిఫికేషన్లు లేటవుతాయి, ఎన్నికల తర్వాతే ఉద్యోగాల భర్తీ అంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు.