సంక్రాంతి దోపిడీకి చెక్ పెట్టిన జగన్
సంక్రాంతి సమయంలో ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. సాధారణ చార్జీలతోనే బస్సులు నడపాలని జగన్ చెప్పడంతో ఆర్టీసీ కూడా సాధారణ చార్జీలతో సర్వీసు అందించబోతోంది.
హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల్లో బతకుదెరువు కోసం వెళ్లి ఉంటున్న ఏపీ వాసులకు సంక్రాంతి, దసరా సమయంలో ప్రయాణం పెద్ద సవాలే. భారీగా సంఖ్యలో ఒక్కసారిగా ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి బయలుదేరుతుంటారు.. కాబట్టి ఆ సమయంలో చార్జీల దోపిడీ భారీగా ఉంటోంది. ఆర్టీసీ కూడా ఈ దోపిడీలో భాగస్వామిగానే ఉంటూ వస్తోంది. సంక్రాంతి సమయంలో అధిక చార్జీల వసూలు చేస్తుంటారు. 25ఏళ్లుగా ఈ తంతు నడుస్తోంది. ఆర్టీసీ కూడా చార్జీల ధరలను 150 శాతం వరకు పెంచి సంక్రాంతి సమయంలో కాసుల వేట చేస్తుంటుంది.
ఈసారి ఆ బెడద లేనట్టే. పండుగ సమయంలో సొంత రాష్ట్రానికి ఆనందంగా వచ్చే వారి నుంచి ఇలా దోచుకోవడం సరికాదని అధికారులకు జగన్ స్పష్టం చేశారు. సంక్రాంతి సమయంలో ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. సాధారణ చార్జీలతోనే బస్సులు నడపాలని జగన్ చెప్పడంతో ఆర్టీసీ కూడా సాధారణ చార్జీలతో సర్వీసు అందించబోతోంది.
ఇతర రాష్ట్రాల నుంచి సొంత ప్రాంతానికి వచ్చే ప్రయాణికుల కోసం 6400 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సంక్రాంతికి ముందు అంటే జనవరి 6 నుంచి 14 వరకు 3,120 ప్రత్యేక బస్సు సర్వీసులను, సంక్రాంతి అనంతరం జనవరి 15 నుంచి 18 వరకు 3,280 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమలరావు వెల్లడించారు.
హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచే 3,600 సర్వీసులను నడుపుతారు. బెంగళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 బస్సు సర్వీసులను నడుపుతారు. దూర ప్రాంత సర్వీసుల్లో వచ్చి వెళ్లేందుకు ముందుగానే ఒకేసారి రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణ చార్జీలో 10 శాతం రాయితీ ఇస్తామని ఆర్టీసీ ఎండి వెల్లడించారు.