Telugu Global
Andhra Pradesh

ఉత్తరాంధ్రకు మహర్దశ మొదలైందా?

మే 3వ తేదీన ఒకేరోజు రెండు భారీ అభివృద్ధి కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఒకటేమో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ. రెండోది భోగాపురంలో అంతర్జాతీయ విమనాశ్రాయం నిర్మాణానికి శంకుస్థాపన.

ఉత్తరాంధ్రకు మహర్దశ మొదలైందా?
X

అభివృద్ధిలో దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర నిర్లక్ష్యానికి గురైందన్నది నిజం. పాలకులు కూడా విశాఖపట్నం అభివృద్ధినే యావత్ ఉత్తరాంధ్ర అభివృద్ధిగా చూపించేవారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో విశాఖ నగరం ఒక భాగం మాత్రమే. అయితే బాగా డెవలప్ అయిన విశాఖను చూపించటం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగినట్లు కలరింగ్ ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు నిజంగానే ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఉత్తరాంధ్రకు మహర్దశ మొదలైనట్లే అనిపిస్తోంది.

మే 3వ తేదీన ఒకేరోజు రెండు భారీ అభివృద్ధి కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఒకటేమో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ. వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో అదానీ కంపెనీ అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. 20 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు అంతేస్థాయిలో ఉపాధి దొరికే అవకాశముంది డేటా సెంటర్ నిర్మాణం గనుక పూర్తయితే. ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యమివ్వాలని జగన్ ఇప్పటికే కంపెనీ యాజమాన్యానికి చెప్పారట. ఇక ఉపాధి ఎలాగూ స్థానికులకే దక్కుతుంది.

ఇది కాకుండా విజయనగరం-విశాఖ-శ్రీకాకుళం జిల్లాలకు మధ్యలో ఉన్న భోగాపురంలో అంతర్జాతీయ విమనాశ్రాయం నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. విమానాశ్రయం నిర్మాణ వ్యయం రూ.5 వేల కోట్లు. మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది, రెండో దశ పూర్తయితే 1.20 కోట్లు, మూడో దశ పూర్తయితే 1.80 కోట్ల మంది ప్రయాణం చేయటానికి వీలుగా విమానాశ్రయం నిర్మించబోతున్నారు. 2025 మే నెలలో విమానాశ్రయం ప్రారంభించాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు. దీని ఆధారంగా చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవ్వటం ఖాయం.

ఈ మధ్యనే శ్రీకాకుళంలో మూలపాడు(భావనపాడు) పోర్టుకు శంకుస్థాపన చేశారు. పనులు మొదలయ్యాయి. అలాగే శ్రీకాకుళంలోనే ఉద్దానం మండంలోని కిడ్నీ బాధితుల కోసం రీసెర్చి సెంటర్, సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణం పూర్తికావచ్చింది. సుమారు 800 గ్రామాల పరిధిలోని ప్ర‌జ‌ల‌ కోసం వంశధార నుండి మంచినీటి సరఫరా ఏర్పాట్లు కూడా పూర్తవుతోంది. రిజర్వాయర్లు, స్టోరేజీ ట్యాంకులు, పైప్‌లైన్లు, ఇంటింటికి కొళాయి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక, విజయనగరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు క్లియరెన్సుకోసం వెయిట్ చేస్తోంది ప్రభుత్వం. అన్నీ జరిగితే ఉత్తరాంధ్ర అభివృద్ధి కళ్ళకు కనబడటం ఖాయం.

First Published:  29 April 2023 11:07 AM IST
Next Story