చంద్రబాబుకే రివర్సు కొట్టిన జీవో
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా 2016లో జీవో-340 రిలీజ్ చేశారు. అప్పట్లో టీడీపీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయం పూర్తిగా టీడీపీకి మాత్రమే అనుకూలంగా ఉండేట్లుగా నిబంధనలు పెట్టారు. అయితే అవే నిబంధనలు 2019 ఎన్నికల్లో ఘన విజయం కారణంగా వైసీపీకి పూర్తిగా అడ్వాంటేజ్ అయ్యింది.
ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బుపట్టించాలనే ఉద్దేశంతో టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు రివర్సు కొడుతున్నాయి. తాజాగా జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ ఆఫీసు కోసం కేటాయించిన విషయంలో అమరావతి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయటంతో పిటీషనర్‌కు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే మచిలీపట్నంలో 2 ఎకరాల స్థలాన్ని వైసీపీ ఆఫీసు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. పార్టీ ఆఫీసుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించటాన్ని సవాలు చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యాం దాఖలైంది.
ఇదిపేరుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా దాఖలవుతున్న వ్యాజ్యాల్లో ఎక్కువభాగం టీడీపీ నేతలే వేయిస్తున్నారు. ప్రస్తుత కేసును విచారించిన న్యాయస్థానం పిటీషనర్‌ను పట్టుకుని వాయించేసింది. పార్టీ ఆఫీసుకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించటంలో తప్పేముందని పిటీషనర్‌ను అడిగింది. ప్రభుత్వ స్థలాన్ని పార్టీ ఆఫీసు నిర్మాణానికి కేటాయించటం తప్పని పిటీషనర్ తరపు లాయర్ వాదించారు. ప్రభుత్వ స్థలాన్ని పార్టీ ఆఫీసుకు కేటాయించే నిర్ణయాన్ని తీసుకున్నది ఎవరని న్యాయస్థానం ప్రశ్నించింది.
దాంతో లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా 2016లో ఈ నిర్ణయం తీసుకుని జీవో-340 రిలీజ్ చేశారు. అప్పట్లో టీడీపీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయం పూర్తిగా టీడీపీకి మాత్రమే అనుకూలంగా ఉండేట్లుగా నిబంధనలు పెట్టారు. అయితే అవే నిబంధనలు 2019 ఎన్నికల్లో ఘన విజయం కారణంగా వైసీపీకి పూర్తిగా అడ్వాంటేజ్ అయ్యింది.
దాన్ని టీడీపీ తట్టుకోలేకపోతోంది. అందుకనే వైసీపీ ఆఫీసులకు ఎక్కడ స్థలం కేటాయించుకుంటున్నా వెంటనే ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ఈ విషయాన్నే హైకోర్టు డైరెక్ట్‌గా అడిగింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పటి ప్రభుత్వం ఫాలో అవుతున్నదికదా అన్న ప్రశ్నకు పిటీషనర్ లాయర్ సమాధానం ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ నిర్ణయంలో తప్పేమీలేదని కావాలంటే జీవోను సవాలు చేయాలని న్యాయమూర్తి సూచించారు. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాన్ని కాకుండా జీవోను సవాలు చేస్తే చంద్రబాబు ఇరుక్కుంటారు. ఎలాగంటే జీవోనే తప్పంటే అప్పట్లో టీడీపీ ఆఫీసులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలన్నింటినీ ప్రభుత్వం వెనక్కుతీసుకోవాలని హైకోర్టు ఆదేశిస్తుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అందుకనే పిటీషనర్ లాయర్ ఏమి మాట్లాడలేక విచారణను వాయిదా వేయించుకున్నారు.