Telugu Global
Andhra Pradesh

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023.. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపైనే దృష్టి

రాష్ట్రంలో ఏరోస్పేస్ (అంతరిక్ష), డిఫెన్స్ (రక్షణ) రంగాలకు చెందిన సంస్థలు తీసుకొని రావడానికి ఎక్కువ దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023.. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపైనే దృష్టి
X

ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు తీసుకొని రావడమే లక్ష్యంగా వైజాగ్‌లో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఏపీకి ఉన్న అనుకూలతలను పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు వివరించడానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ (అంతరిక్ష), డిఫెన్స్ (రక్షణ) రంగాలకు చెందిన సంస్థలు తీసుకొని రావడానికి ఎక్కువ దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీలో ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అనుకూల పాలసీలు, ఎకోసిస్టమ్, పోర్టులు, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, సహజ వనరులు, నిపుణులు, చక్కడి బిజినెస్ ఎన్విరాన్‌మెంట్ ఉంటుందనే విషయాలు అందరికీ వివరించడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అన్ని అవకాశాలను పూర్తిగా వెల్లడించనున్నారు.

ఇండియాలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఏపీలో ఉన్న సుదీర్ఘ సముద్రతీరం ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలకు అనుకూలంగా ఉండనున్నది. నౌకాదళం, ఇస్రో రాకెట్ లాంచింగ్ కేంద్రాలు ఏపీలో ఉన్న విషయాలను ఇన్వెస్టర్లుకు వివరించనున్నారు. అలాగే రాష్ట్రంలో డీఆర్డీవో, బీఈఎల్, బీడీఎల్, ఎన్ఏఆర్ఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఉన్నాయి. వీటి గురించి కూడా ప్రస్తావించనున్నారు.

ఏరోస్సేస్, డిఫెన్స్ రంగాల్లో ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఏపీలో నడుస్తున్నాయి. వీటిలో భారీగా పెట్టుబడులు పెట్టారు. మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ రెండు రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అనంతపూర్‌లో ఉన్న బీఈఎల్ సంస్థ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మిస్తోంది. ఇక్కడ ఆయుధాలతో పాటు రాడార్లు కూడా తయారు చేస్తున్నారు. న్యూ జెనరేషన్ నైట్ విజన్ కెమేరాలు, ఎలక్ట్రో ఆప్టిక్స్ పరికరాలు తయారు చేసే పరిశ్రమ కృష్ణా జిల్లాలో రానున్నది. ఇక వైజాగ్ సమీపంలో ఎయిర్ కార్గో కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఇది రాష్ట్ర లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఊతం ఇవ్వనున్నది.

అనంతపూర్ జిల్లాలో స్టంప్ ష్యూల్ కేసింగ్స్ అమ్యునైషన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, నెల్లూరు జిల్లాలో ప్రీమియర్ ఎక్లోసీవ్స్ సాలిడ్ రాకెట్ ప్రొపెల్లంట్ ప్లాంట్ కూడా రానున్నది.డీఆర్డీవోకి చెందిన మిసైల్ టెస్టింగ్ కేంద్రం కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. ఇక విశాఖపట్నం భోగాపురం విమానాశ్రయం నిర్మించే ప్రాంతానికి సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మైంటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.కర్నూలు జిల్లాలో ఇప్పటికే డీఆర్డీవోకు చెందిన వార్‌ఫేర్ టెస్ట్ రేంజ్ ఉన్నది. వీటన్నింటికీ సంబంధించిన వివరాలను గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధులకు వివరించనున్నారు.


First Published:  1 March 2023 10:44 AM IST
Next Story