ఏపీలో గ్లోబల్ సమ్మిట్.. 2లక్షల కోట్ల పెట్టుబడుల అంచనా..
దేశవిదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు.. అందరూ కలిసి 10వేలమంది వరకు హాజరవుతారని అంచనా.
రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు, పరిశ్రమలను తరిమేస్తున్నారన్న వెటకారాల మధ్య ఎన్నికలకు ఏడాది ముందు ఏపీలో పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. భావి రాజధానిగా ప్రకటింపబడిన విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఈ సదస్సు ఈరోజు, రేపు జరుగుతుంది.
కాసేపట్లో సీఎం జగన్ ఈ సదస్సుని అధికారికంగా ప్రారంభిస్తారు. దేశవిదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు.. అందరూ కలిసి 10వేలమంది వరకు హాజరవుతారని అంచనా. ఇక కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. అంబానీ గ్రూప్, టాటా గ్రూప్, బిర్లా గ్రూప్... ఇలా దేశీయ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
2లక్షల కోట్ల పెట్టుబడుల అంచనా..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్-1 అని చెప్పుకుంటున్నారే కానీ ఎంత బిజినెస్ జరిగింది, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉపాధి లభించింది అనే విషయంలో పక్కా లెక్కలు మాత్రం నాయకుల వద్ద లేవు. జాకీని తరిమేశారు, అమర రాజాని పక్క రాష్ట్రానికిపంపేశారు, అదానీకి పోర్టులు సమర్పించారు.. ఇలా రకరకాల విమర్శలు ప్రతిపక్షాలనుంచి వినపడుతున్నవేళ.. అందరూ ఆశ్చర్యపోయేలా పెట్టుబడుల సదస్సు జరపాలని ప్రభుత్వం నిశ్చయించింది. 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏపీకి వస్తాయని ఆశిస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు 118 స్టాల్స్ తో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను సీఎం జగన్, కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభిస్తారు. సాయంత్రం వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి. పారిశ్రామిక ప్రముఖులతో సీఎం జగన్, రాష్ట్ర మంత్రులు సమావేశాలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. రెండో రోజు సదస్సులో ఉదయం 9.30 నుంచి 10.30 వరకు పెట్టుబడులపై ఒప్పందాలు జరుగుతాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ముగుస్తుంది. ఈ సదస్సుకు 26 దేశాల నుంచి అతిథులు, పారిశ్రామికవేత్తలు వస్తారని అంచనా. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సదస్సు ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో, ఒప్పందాల్లో ఎన్ని కార్యరూపం దాలుస్తాయో చూడాలి.