Telugu Global
Andhra Pradesh

కూటమి నెత్తిన భస్మాసుర 'గ్లాసు'

పగిలేకొద్దీ పదునెక్కడం అటుంచితే.. పగలకుండానే కూటమి అభ్యర్థుల్ని కుళ్లబొడవడానికి రెడీ అయింది గాజు గ్లాసు.

కూటమి నెత్తిన భస్మాసుర గ్లాసు
X

పనిగట్టుకుని సీఎం జగన్ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేకండా పోయింది. వైసీపీ అభ్యర్థులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా బలంగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదనే చెప్పాలి. కూటమి నెత్తిన గాజు గ్లాసు భస్మాసుర హస్తంలా మారింది. జనసేన పోటీ చేయని చోట్ల కూటమిని చావుదెబ్బ తీసేందుకు గాజు గ్లాసు ఈవీఎంలలో సిద్ధమవుతోంది. పగిలేకొద్దీ పదునెక్కడం అటుంచితే.. పగలకుండానే కూటమి అభ్యర్థుల్ని కుళ్లబొడవడానికి రెడీ అయింది గాజు గ్లాసు.

స్వయంకృతాపరాథం..

పార్టీ నిర్మాణం పక్కనపెట్టి, ప్రతి ఎన్నికల్లోనూ ప్యాకేజీతో సరిపెట్టుకుని, కనీసం ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా త్యాగాలు చేసి.. జనసేనను ఈ స్థాయికి తీసుకొచ్చారు పవన్ కల్యాణ్. కనీసం గుర్తుకి కూడా మొహం వాచిపోయేలా, పోటీ చేసిన ప్రతిసారీ ఈసీ దయాదాక్షిణ్యాలకోసం ఎదురు చూడాల్సి వస్తుందంటే పవన్ ఏ స్థాయి నాయకుడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు గాజుగ్లాసు గుర్తు రావడం కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం. అది ఊరట అనుకునే లోపే అంతకంటే ప్రమాదకర పరిణామం మరొకటి జరిగిపోయింది. జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరిన చోటల్లా గాజు గ్లాస్ గుర్తుని కేటాయించారు రిటర్నింగ్ అధికారులు. అంటే టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో గ్లాస్ గుర్తు వారిని బాగా డ్యామేజీ చేయబోతుందనమాట.

నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పేరుతో బకెట్ గుర్తుతో కొంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గాజు గ్లాసు, బకెట్ కి మధ్య తేడా తెలియక అభ్యర్థులు తికమకపడుతారేమోననే భయం కూటమిలో ఉంది. బకెట్ కాదు, ఏకంగా గాజు గ్లాసే ఇప్పుడు రంగంలోకి దిగింది. జనసేన పోటీ చేయని స్థానాల్లో గాజు గ్లాసు తెచ్చుకున్న ఇండిపెండెంట్లు, టీడీపీ, బీజేపీ రెబల్స్.. కసి తీర్చుకోడానికి రెడీగా ఉన్నారు.

గ్లాస్ గందరగోళం..

విజయనగరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రెబల్ గా నామినేషన్ వేసిన మీసాల గీతకు గాజుగ్లాస్ గుర్తు లభించింది. దీంతో అక్కడ కూటమి ఇరుకున పడింది. మైలవరం స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్ కి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. విజయవాడ సెంట్రల్‌లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్, టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్, కాకినాడ జిల్లా జగ్గంపేట స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్ర, కావలి టీడీపీ రెబల్ సుధాకర్, ఆత్మకూరులో ఇండిపెండెంట్ అభ్యర్థికి, పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు నంబూరు కళ్యాణ్ బాబుకి, గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణకు, మంగళగిరిలో రావుసుబ్రహ్మణ్యంకు కూడా గాజు గ్లాస్ కేటాయించారు. ఎస్.కోటలో జనసేన రెబల్ కొట్యాడ లోకాభిరామకోటి గాజు గ్లాస్ తెచ్చుకుని అక్కడ కూటమి ఓటమిని శాసిస్తున్నారు. అనకాపల్లి, విజయవాడ ఎంపీ స్థానాల పోటీలో కూడా గాజు గ్లాస్ తెరపైకి వస్తోంది.

జిల్లాలవారీగా చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏకంగా ఐదు స్థానాల్లో గాజు గ్లాస్ బరిలో నిలబడింది. నగరి నియోజకవర్గంతోపాటు తిరుపతి జిల్లాలో నలుగురికి గాజు గ్లాస్ సింబల్ లభించింది. ఉమ్మడి కర్నూలులో మూడు నియోజకవర్గాల్లో గ్లాస్ సింబల్ కనపడుతుంది. నెల్లూరు జిల్లాలో కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ తో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈ పరిస్థితి ఉంది.

చేతులు కాలాక..

గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్స్ లిస్ట్ లో ఉన్నా కూడా ఈ స్థాయిలో అభ్యర్థులకు కేటాయింపులు ఉంటాయని కూటమి ఊహించలేదు. ఇప్పుడు గుర్తులు కేటాయించాక లబోదిబోమంటున్నారు నేతలు. మంగళగిరిలో కూడా గాజుగ్లాస్ గుర్తుపై ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీలో ఉండటంతో లోకేష్ కి షాక్ తగిలింది. దీనిపై ఇప్పుడు ఈసీకి ఫిర్యాదులు చేస్తోంది జనసేన. కూటమిగా 10శాతం స్థానాలకంటే ఎక్కువ చోట్ల తాము పోటీ చేస్తున్నామని గాజు గ్లాసు ఎవరికీ కేటాయించొద్దని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ షాక్ నుంచి కూటమి తేరుకుంటుందో లేదో చూడాలి.

First Published:  30 April 2024 10:55 AM IST
Next Story