జగన్ ఇంటి ముందు కూల్చివేతలు.. కమిషనర్‌పై వేటు!
కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ అధికారులకు ఎలాంటి ప్రాథమిక సమాచారం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటి ముందు ఉన్న నిర్మాణాలను కూల్చివేసిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేయాలని ఆదేశాలిచ్చిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై వేటు వేశారు GHMC కమిషనర్ ఆమ్రపాలి. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టినందుకు హేమంత్‌ను GADకి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
లోటస్‌పాండ్‌లోని జగన్ ఇంటి ముందు సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన షెడ్లను అక్రమనిర్మాణాలుగా గుర్తిస్తూ GHMC టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చివేశారు. ఐతే కూల్చివేతలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ అధికారులకు ఎలాంటి ప్రాథమిక సమాచారం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
లోటస్‌పాండ్‌లోని జగన్ ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న దక్షిణ తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి ఆదేశాలతోనే ఈ కూల్చివేతలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. GHMC ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా ఉన్న హేమంత్‌కు సదరు మంత్రి ఫోన్ చేసి కూల్చివేతలకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.