పోకిరి సినిమా చూపిస్తూ మెదడుకు ఆపరేషన్
వైద్యులు రోగితో మాట్లాడుతూ డాక్టర్లు చెప్పిన విధంగా కాలు చేయి కదుపుతుండగా మెదడులోని సున్నితమైన భాగాలకు దెబ్బ తగలకుండా ఆపరేషన్ పూర్తి చేశారు.
గుంటూరు జనరల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ జరిగింది. పేషెంట్ మెలుకువగా ఉండగానే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు వైద్యులు. ఈ తరహా ఆపరేషన్లు ఏపీలోని ఏ ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగలేదని మొదటిసారి గుంటూరులో చేశామని ఆస్పత్రివర్గాలు చెప్పాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన పండు అనారోగ్యానికి గురయ్యాడు. జనవరి 2న అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని గుంటూరు GGHలో చేర్చారు. అప్పటికే కుడిచేయి, కాలు చచ్చు పడిపోయాయి. వైద్యులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. మెదడులోని ఎడమ భాగంలో ఉండే మోటార్ కార్టెక్స్‌లో కణితి ఉందని గుర్తించారు. దానివల్లే కాలు, చేయి చచ్చుబడిందని తెలిపారు.
రోగికి శస్త్ర చికిత్స చేసి కణితిని తొలగించాలి. మెదడులోని సున్నితమైన భాగం కావడంతో రోగి మెలుకువగా ఉన్నప్పుడే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని రోగికి, అతని బంధువులకు డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ జరిగే సమయంలో ప్రాణానికే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందే చెప్పారు. అయినప్పటికీ ఆపరేషన్ చేయాలని బంధువులు వైద్యులకు తెలిపారు. దీంతో వైద్యులు రోగికి సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చారు. రోగి మెలకువగా ఉన్న టైంలోనే ఆపరేషన్ చేయాలి కాబట్టి రోగికి ఇష్టమైన హీరో ఎవరో కనుకున్నారు. మహేష్ బాబు అని తెలుసుకుని, పండుకి ఇష్టమైన పోకిరి సినిమా వేసి అతను చూస్తుండగా ఆపరేషన్ చేయడం మొదలు పెట్టారు.
వైద్యులు రోగితో మాట్లాడుతూ డాక్టర్లు చెప్పిన విధంగా కాలు చేయి కదుపుతుండగా మెదడులోని సున్నితమైన భాగాలకు దెబ్బ తగలకుండా ఆపరేషన్ పూర్తి చేశారు. వైద్య పరిభాషలో దీన్ని అవేక్ సర్జరీ అని అంటారు. మెదడులోని ఇతర భాగాలకు ఎటువంటి సమస్య రాకుండా ఇలాంటి శస్త్ర చికిత్స చేస్తుంటారని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ పూర్తయ్యాక పండు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో అతన్ని డిశ్చార్జ్ చేశారు.