Telugu Global
Andhra Pradesh

సిలిండర్ రేట్లు.. ఏపీలో పెగలని నోళ్లు

5, 10, 20, 50 అంటూ క్రమక్రమంగా వాతలు పెట్టుకుంటూ సిలిండర్ రేటు పెంచి, ఒకేసారి 200 రూపాయలు తగ్గించాం, పండగ చేసుకోమంటోంది బీజేపీ. మరి ఈ పండగను ఆ పార్టీ అధికారిక మిత్రపక్షం జనసేన కూడా స్వాగతించకపోవడమే విడ్డూరం.

సిలిండర్ రేట్లు.. ఏపీలో పెగలని నోళ్లు
X

గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గించడాన్ని ఎన్నికల డ్రామాగా కొట్టిపారేసింది బీఆర్ఎస్. ఇండియా కూటమి పార్టీలు కూడా అది మోదీ ఎన్నికల స్టంట్ అని తేల్చేశాయి. తటస్థ పార్టీలు.. కేంద్ర ప్రభుత్వ వ్యూహాలను ప్రజలు అర్థం చేసుకుంటారని మండిపడ్డాయి. అయితే విచిత్రంగా ఏపీనుంచి మాత్రం ఎలాంటి సౌండ్ లేదు. టీడీపీ, వైసీపీ, జనసేన.. ఏ ఒక్కరూ గ్యాస్ సిలిండర్ రేటు తగ్గడాన్ని స్వాగతించలేదు, విమర్శించలేదు.

గ్యాస్ బండతో ప్రజల్ని బాదిపడేశారు, పెట్రోల్ రేట్లతో కుళ్లబొడిచారు, కూరగాయల రేట్లతో నరకం చూపెడుతున్నారంటూ నిన్న మొన్నటి వరకూ టీడీపీ ప్రజల పక్షాన తెగ ఇదైపోయింది. సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. మరిప్పుడు కేంద్రం గ్యాస్ సిలిండర్ రేటుని 200 రూపాయలు తగ్గించడంపై టీడీపీ నోరు పెగలలేదు. పోనీ కేంద్రం దయా ధర్మం ఇది అని కూడా చెప్పలేకపోతున్నారు నాయకులు.

800 రూపాయలు పెంచి, 200 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం.. వంటివి పండగ ఆఫర్లలో చూస్తుంటాం. మంచి మార్కెటింగ్ టెక్నిక్ అది. అలాంటి టెక్నిక్ నే కేంద్రంలోని బీజేపీ.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రయోగించింది. 5, 10, 20, 50 అంటూ క్రమక్రమంగా వాతలు పెట్టుకుంటూ సిలిండర్ రేటు పెంచి, ఒకేసారి 200 రూపాయలు తగ్గించాం, పండగ చేసుకోమంటోంది. మరి ఈ పండగను ఆ పార్టీ అధికారిక మిత్రపక్షం జనసేన కూడా స్వాగతించకపోవడమే విడ్డూరం.

వైసీపీ కూడా సైలెంట్ గానే ఉంది. గతంలో గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినప్పుడు ఆ పార్టీ కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడూ నోరు మెదపలేదు. ఇప్పుడు స్పందిస్తుందని ఆశించడం కూడా కరెక్ట్ కాదు. వైసీపీది వ్యూహాత్మక మౌనం అనుకున్నా.. గ్యాస్ సిలిండర్ రేట్లపై రచ్చ చేసిన టీడీపీ, జనసేన కూడా సైలెంట్ గా ఉండటం మాత్రం విశేషమే. పొరపాటున మోదీ నిర్ణయాన్ని స్వాగతించినా ఆ రెండు పార్టీలకు అది మరింత నష్టం. అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఈ విషయంలో మౌనాన్ని ఆశ్రయించారు.

First Published:  31 Aug 2023 9:17 AM IST
Next Story