Telugu Global
Andhra Pradesh

ఎవడండీ గంటా..? అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం..

గంటాపై అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు..! లక్షల్లో నేనొక్కడిని అన్నారు. గంటా ఏమైనా పెద్ద నాయకుడా..? లేక ప్రధానా..? అంటూ ప్రశ్నించారు అయ్యన్న.

Ganta Srinivasa Rao vs Ayyanna Patrudu new episode in TDP
X

ఎవడండీ గంటా..? అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం..

ఉన్నవాళ్లు నలుగురు, ఆ నలుగురిలో కూడా ఒకరంటే ఒకరికి పడదు. ఇలా ఉంది టీడీపీ పరిస్థితి. గడ్డుకాలంలో నేతలంతా పార్టీకి దూరం జరుగుతున్న వేళ.. ఉన్నవాళ్లు కూడా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. అధినాయకత్వం మెప్పుకోసం తమలోతామే కుమ్ములాడుకుంటున్నారు. తాజాగా గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడి మధ్య రచ్చ మొదలైంది.

వాస్తవానికి గంటా శ్రీనివాసరావు టీడీపీతో చాన్నాళ్లుగా అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. ఆయన వైసీపీలోకి వెళ్తారని అనుకున్నా.. విశాఖ నుంచి కొందరు పెద్ద నేతలు గట్టిగా అడ్డుకున్నారని, అందుకే జగన్ డోర్లు తెరవలేదనే ప్రచారం ఉంది.


బీజేపీ, జనసేనపై గంటాకి పెద్దగా గురిలేదు, అందుకే ఆయన ఆ వైపు చూడలేదు. తీరా ఏదారీ లేకపోవడంతో టీడీపీ దారిలోనే వెళ్లడానికి డిసైడ్ అయ్యారు. ఇటీవల ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా నారా లోకేష్ ని ఆకాశానికెత్తేశారు. దీంతో గంటా టీడీపీలోనే ఉండిపోతారనే విషయం ఖాయమైపోయింది. ఈదశలో గంటా వ్యతిరేక వర్గం తెరపైకి వచ్చింది. ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు పార్టీకి దూరంగా ఉన్న గంటా, ఎన్నికల టైమ్ లో మళ్లీ లైమ్ లైట్లోకి రావాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు అయ్యన్నపాత్రుడు.

ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు..

గంటాపై అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవడండీ గంటా..? లక్షల్లో వాడొక్కడు..! లక్షల్లో నేనొక్కడిని అన్నారు. గంటా ఏమైనా పెద్ద నాయకుడా..? లేక ప్రధానా..? అంటూ ప్రశ్నించారు అయ్యన్న. “పార్టీలో అందరూ రావాలి, పని చేయాలి.. అంతేకాని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బొక్కల్లో దాక్కుని.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ బయటకు రావడం సరికాదు.” అంటూ మండిపడ్డారు అయ్యన్న పాత్రుడు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అండగా ఉండాలనే తాము కోరుకున్నామని, అలా అండగా ఉండని వారిని చూస్తే బాధకలుగుతుందని చెప్పారు.

చివరకు అండర్వేర్లు కూడా..

గంటా ఎపిసోడ్ తర్వాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు అయ్యన్నపాత్రుడు. సాఫ్ట్ వేర్లు, హార్డువేర్లే కాదు, చివరకు అండర్వేర్ కంపెనీలు కూడా ఏపీ నుంచి తరలిపోతున్నాయని ఎద్దేవా చేశారు అయ్యన్నపాత్రుడు. చివరకు బ్రాందీ షాపులను 25 ఏళ్ల పాటు తనఖా పెట్టి ప్రభుత్వం రూ.8700 కోట్లు అప్పుతెచ్చిందని ఎద్దేవా చేశారు. బ్రాందీ షాపులను తనఖా పెట్టిన దౌర్బాగ్యుడని తెలియక ప్రజలు ఓటేశారని జగన్ పై మండిపడ్డారు.

First Published:  19 Jan 2023 2:17 PM IST
Next Story