సీటుకు గ్యారంటీ లేదు.. మరి గంటా దారెటు..?
రాష్ట్ర రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది విభిన్న శైలి. ఆయన ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయరు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా మూడేళ్ల కిందట చేసిన రాజీనామాను స్పీకర్ నిన్న ఆమోదించారు. అయితే ఈ రాజీనామా విషయం పక్కనపెడితే వచ్చే ఎన్నికల్లో గంటా ఎక్కడ పోటీ చేస్తారనేది అనుమానంగా మారింది.
నెల్లిమర్లపై గురి.. నో అంటున్న బాబు
గంటా శ్రీనివాసరావు ఈసారి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయనని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటు అడుగుతున్నారు. అయితే అందుకు బాబు సిద్ధంగా లేరని సమాచారం. తాను కోరుకున్న టికెట్ ఇవ్వకపోతే గంటా విశాఖ దక్షిణ సీట్లో సర్దుకుంటారా..? లేకపోతే వేరే పార్టీల వైపు చూస్తారా అనేది ఇప్పుడు విశాఖ జిల్లాలో చర్చ.
ఎక్కడైనా ఒక్కసారే.. రెండోసారి మారాల్సిందే
రాష్ట్ర రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది విభిన్న శైలి. ఆయన ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయరు. 1999లో టీడీపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. 2004లో చోడవరం ఎమ్మెల్యే అయ్యారు. 2009లో ప్రజారాజ్యం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో భీమిలీ నుంచి, 2019లో విశాఖ సౌత్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఇప్పటి వరకు ఆయన ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయలేదు, అలాగే ఎప్పడూ ఓడిపోలేదు.
అన్ని పార్టీలూ తిరిగేశారు.. వైసీపీ తప్ప
టీడీపీతో ప్రయాణం ప్రారంభించి తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు గంటా. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనంతర్వాత ఆ పార్టీ తరఫున మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వా త మళ్లీ టీడీపీలోకి వెళ్లి గెలిచి, అక్కడా అమాత్యపదవి దక్కించుకున్నారు. వైసీపీ తప్ప అన్ని పార్టీలూ తిరిగేశారు. జనసేనలోకి వెళ్లి టికెట్ అడిగే అవకాశాల్ని కొట్టిపారేయలేమంటున్నారు ఆయన పద్ధతి తెలిసిన రాజకీయ విశ్లేషకులు.