గంటా హడావుడికి అసలు కారణమిదేనా?
ఎలాగూ మోడీ విశాఖలోనే రెండు రోజులుండబోతున్నారు కదా అందుకనే తన రాజీనామాపై హడావుడి మొదలుపెట్టారట. ఉక్కు పరిరక్షణ కమిటి నేతలను మోడీ దగ్గరకు తీసుకెళ్ళేందుకు గంటా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్ళీ హడావుడి మొదలుపెట్టారా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈనెల 11, 12 తేదీల్లో నరేంద్ర మోడీ విశాఖలోనే ఉండబోతున్నారు. అనేక శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. సరిగ్గా ఇదే సమయంలో అప్పుడెప్పుడో చేసిన తన రాజీనామాను ఆమోదించాలంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను గంటా అడిగారు.
ఇంతకీ అప్పుడు గంటా ఎందుకు రాజీనామా చేశారంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు మోడీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటీకరించటంలో భాగంగా ఒక్కో విభాగాన్ని కాంట్రాక్టు పద్దతిలో లీజుకు ఇచ్చేసేందుకు నోటిపికేషన్ కూడా ఇస్తోంది. దీనికి నిరసనగా ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు దాదాపు ఏడాది నుండి ఆందోళనలు చేస్తున్నారు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గంటా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వ్యక్తి అప్పట్లో ఒకసారి స్పీకర్‌తో మాట్లాడారు కానీ మళ్ళీ పట్టించుకోలేదు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు తన రాజీనామాను ఆమోదించాలంటు గోల మొదలుపెట్టారు.
అయితే పార్టీలోనే గంటా గోలవెనుక ఒక ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే వచ్చే ఎన్నికల్లో గాజువాక నుండి పోటీ చేయటానికి గంటా రెడీ అవుతున్నారట. గంటాకు ఉన్న అలవాటు ఏమిటంటే ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మార్చేయటం. అనకాపల్లి, భీమిలి, విశాఖ ఉత్తరంలో గెలిచిన గంటా వచ్చే ఎన్నికల్లో గాజువాక నుండి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగానే ఉక్కు ఫ్యాక్టరీ ఆందోళనలను అడ్వాంటేజ్ తీసుకుని చొచ్చుకుపోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే ఫ్యాక్టరీ ఉన్నది గాజువాక నియోజకవర్గంలోనే. అందుకనే గంటా రెగ్యులర్‌గా ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులతో భేటీ అవుతున్నారు. ఎలాగూ మోడీ విశాఖలోనే రెండు రోజులుండబోతున్నారు కదా అందుకనే తన రాజీనామాపై హడావుడి మొదలుపెట్టారట. ఉక్కు పరిరక్షణ కమిటి నేతలను మోడీ దగ్గరకు తీసుకెళ్ళేందుకు గంటా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి గంటా ప్రయత్నాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.