Telugu Global
Andhra Pradesh

జగన్ కి మరో తలనొప్పి.. ఈసారి గన్నవరం

ఆమధ్య సీఎం జగన్, పరిస్థితి సర్దుబాటు చేసినా.. మళ్లీ ఇప్పుడు గన్నవరం గరం గరంగా మారింది. రామచంద్రాపురం ఎఫెక్ట్ పడిందేమో.. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు తిరుగుబాటు జెండా ఎగరేశారు.

జగన్ కి మరో తలనొప్పి.. ఈసారి గన్నవరం
X

వైనాట్ 175 అనేది జగన్ నినాదం. అంటే ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదీ వైసీపీ చేజారకూడదనేది ఆయన అభిమతం. అయితే 2019లో వైసీపీ గెలిచిన 151లోనే ఇటీవల 4 చేజారాయి. మిగతా నియోజకవర్గాల్లో అక్కడక్కడ లుకలుకలు మొదలయ్యాయి. ఈ గొడవలతో వైసీపీకి నష్టం జరుగుతుందనుకోలేం, జగన్ బలహీనపడతారని కూడా అంచనా వేయలేం. కానీ పార్టీలో గొడవలు పడి బయటకెళ్లిన నాయకులు వైరివర్గానికి కొమ్ముకాసినా, లేదా ప్రత్యర్థి పార్టీలో చేరి పోటీ చేసినా వైసీపీకి గెలుపు సునాయాసం కాదని చెప్పుకోవాలి. ఇటీవల రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన గొడవ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కాగా, ఈరోజు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం వ్యవహారం హైలెట్ గా మారింది.

గన్నవరంలో టీడీపీ టికెట్ పై గెలిచిన వల్లభనేని వంశీ కాలక్రమంలో వైసీపీవైపు వచ్చారు. వచ్చే దఫా ఆయనకే గన్నవరం వైసీపీ టికెట్ అనే విషయం తేలిపోయింది. వంశీ చేరికపై వైసీపీ నాయకులిద్దరు కోపంతో ఉన్నారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి వంశీ చేతిలో ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు, 2019లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు.. లోలోపల రగిలిపోతున్నారు. ఆమధ్య సీఎం జగన్ పరిస్థితి సర్దుబాటు చేసినా.. మళ్లీ ఇప్పుడు గన్నవరం గరం గరంగా మారింది. రామచంద్రాపురం ఎఫెక్ట్ పడిందేమో.. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు తిరుగుబాటు జెండా ఎగరేశారు.

టీడీపీలోకి వెళ్తారంటూ వస్తున్న వార్తల్ని యార్లగడ్డ కొట్టిపారేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి తాను పోటీ చేస్తానంటున్నారు యార్లగడ్డ. ఒకవేళ వైసీపీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని చెబుతున్నారు. త్వరలో సీఎం జగన్‌ తో సమావేశమవుతానని, ఆ తర్వాత తన నిర్ణయం వెల్లడిస్తానన్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి గన్నవరం నుంచే పోటీ చేస్తానని కార్యకర్తలకు తేల్చి చెప్పారు. అంటే పరోక్షంగా వల్లభనేని వంశీ అభ్యర్థిత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నట్టే లెక్క. మరి సీఎం జగన్ నిర్ణయం ఎలా ఉందో వేచి చూడాలి.

First Published:  24 July 2023 4:36 PM GMT
Next Story