Telugu Global
Andhra Pradesh

నువ్వు పిల్ల సైకో... నువ్వు మగాడివేనా..?

టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడిలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని మండిపడ్డారు చంద్రబాబు. ఏపీ పోలీస్ వ్యవస్థను వైసీపీలో విలీనం చేశారా అని ప్రశ్నించారు.

నువ్వు పిల్ల సైకో... నువ్వు మగాడివేనా..?
X

గన్నవరంలో టీడీపీ ఆఫీస్ తగలబడింది, అనంతరం జరిగిన ఆందోళనల్లో సీఐ తల పగిలింది. దీనంతటికీ కారణం ఎవరు..? ఎవరు, ఎవరిని రెచ్చగొట్టారు..? ఎవరు ఎవరిపై దాడి చేశారు..? చివరకు అరెస్ట్ అయింది ఎవరు..? ఈ సీక్వెన్స్ అంతా మరోసారి ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పట్టాభి సహా టీడీపీ నేతల కామెంట్లతో వ్యవహారం మరింత ముదిరింది. వంశీని పిల్ల సైకో అనడంతో ఆయన వర్గం నేతలు రెచ్చిపోయారు, టీడీపీ ఆఫీస్ ని ధ్వంసం చేశారు, కార్లను తగలబెట్టారు. ఆఫీస్ పై దాడి చేసింది తమ మనుషులేనంటూ వంశీ పరోక్షంగా ఒప్పుకున్నారు కూడా. ఎక్కడెక్కడినుంచో మా ఊరు వచ్చి నాపై ఆరోపణలు చేస్తే మా అభిమానులు ఎందుకు కామ్ గా ఉంటారని ప్రశ్నిస్తున్నారు వంశీ. నారా లోకేష్ ఫేస్ బుక్ పేజీలో తన ఫొటో ఎందుకు పెట్టారని అన్నారు. వల్లభా, వల్లభా నన్ను గిల్లవా అంటూ తన ఫొటో పెట్టుకున్నారని, లోకేష్ మగాడు కాదా అని ప్రశ్నించారు వంశీ. అసలు చంద్రబాబు, లోకేష్ మగాళ్లేనా అంటూ మండిపడ్డారు. సంకల్ప సిద్ధి అనే కంపెనీతో తనకేమాత్రం సంబంధం లేదని, ఆ విషయంలో తనపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేశానన్నారు వంశీ.

వంశీ వాదన అలా ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ బీఫామ్ కోసం లోకేష్ ఇంటి చుట్టూ వంశీ ఎలా తిరిగారో అందరికీ తెలుసన్నారు. తమ పార్టీ టికెట్ పై గెలిచి, తిరిగి తమ పార్టీ నేతలనే చులకనగా మాట్లాడటం సరికాదంటున్నారు టీడీపీ నేతలు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడిని ఖండించారు. టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడిలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని మండిపడ్డారు చంద్రబాబు. ఏపీ పోలీస్ వ్యవస్థను వైసీపీలో విలీనం చేశారా అని ప్రశ్నించారు చంద్రబాబు.


ఇక ఈ ఎపిసోడ్ లో టీడీపీ నేతలు దేవినేని ఉమా, కొమ్మారెడ్డి పట్టాభిరాం అరెస్ట్ కావడం కొసమెరుపు. దాడి చేసింది వంశీ వర్గీయులైతే, తమ వారిని ఎందుకు అరెస్ట్ చేసారంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు. తన భర్తకు ఏమైనా అయితే పోలీసులదే బాధ్యత అంటూ మీడియాకు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు పట్టాభి భార్య చందన. మొత్తమ్మీద గన్నవరంలో టీడీపీ, వైసీపీ పోటా పోటీ విమర్శలు, దాడులు, ప్రతిదాడులు ఏపీ పాలిటిక్స్ ని మరింత హీటెక్కించాయి.

First Published:  20 Feb 2023 9:57 PM IST
Next Story