Telugu Global
Andhra Pradesh

వైజాగ్‌పై అదానీ మార్క్.. గంగవరం పోర్ట్‌లో100 శాతం వాటా..

గంగవరం పోర్ట్‌ను 6200 కోట్ల రూపాయలకు AP&SEZ చేజిక్కించుకుంది. షేర్ స్వాప్ ఒప్పందం ద్వారా GPL ప్రమోటర్లకు APSEZ లో 4.77 కోట్ల షేర్లు లభిస్తాయి.

వైజాగ్‌పై అదానీ మార్క్.. గంగవరం పోర్ట్‌లో100 శాతం వాటా..
X

ఉత్తరాంధ్రలో రాజధాని వ్యవహారం సెగలు రేపుతున్న వేళ, వైజాగ్‌లోని గంగవరం పోర్ట్ మొత్తం అదానీ గ్రూప్ చేతుల్లోకి వెళ్లడం విశేషం. గంగవరం పోర్ట్ లిమిటెడ్ (GPL)లో పూర్తి వాటా అదానీ గ్రూప్ చేతికి వచ్చింది. గతంలో GPL లో భాగస్వామిగా ఉన్న వార్ బర్గ్ పింకస్ సంస్థ నుంచి 31.5 శాతం వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూప్, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం నుంచి 10.4 శాతం వాటా కూడా తీసేసుకుంది. ఇప్పుడు మిగిలిన 58.1 శాతం వాటాను GPL వద్ద షేర్ల రూపంలో కొనుగోలు చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్(AP&SEZ) సంస్థ పేరుతో ఈ లావాదేవీలు పూర్తయ్యాయి. ఇకపై అదానీ గంగవరం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో గంగవరం పోర్ట్ రూపాంతరం చెందుతుంది.

6200 కోట్ల ఒప్పందం..

గంగవరం పోర్ట్‌ను 6200 కోట్ల రూపాయలకు AP&SEZ చేజిక్కించుకుంది. షేర్ స్వాప్ ఒప్పందం ద్వారా GPL ప్రమోటర్లకు APSEZ లో 4.77 కోట్ల షేర్లు లభిస్తాయి. భారత్‌లోని నాన్ మేజర్ పోర్టుల్లో గంగవరం పోర్ట్ మూడో స్థానంలో ఉంది. ఈ పోర్ట్ 1800 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది. విశాఖ పోర్ట్ కి ధీటుగా ఇది అభివృద్ధి చెందే అవకాశముంది.

విశాఖ సమీపంలో బొర్రమ్మ గెడ్డ నది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ ఓడరేవు ఏర్పాటు చేశారు. దీని నిర్మాణం 2005లో మొదలైంది. గంగవరం పోర్ట్ 2009 జూలై 12 న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. డీవీఎస్ రాజు గ్రూప్ ఆధ్వర్యంలో GPL ఉంది. ఇప్పుడు 100 శాతం వాటా అదానీ పరమైంది. ఇకపై గంగవరం పోర్ట్ అదానీ గంగవరం పోర్ట్‌గా మారిపోతుంది.

First Published:  11 Oct 2022 11:48 AM IST
Next Story