లోకేష్ యాత్రపై గల్లా స్పందన.. ఇంత విచిత్రంగా ఉందేంటి..?
గల్లా జయదేవ్ తన ట్విట్టర్ అకౌంట్లో రెండు ఫొటోలు పోస్ట్ చేశారు. లోకేష్ యాత్రపై తాను కామెంట్లు చేసినట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలకోసం అలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
నారా లోకేష్ యువగళం యాత్ర ఏ ప్రాంతానికి చేరుకుంటే అక్కడి టీడీపీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు హడావిడి చేస్తున్నారు. అయితే యాత్ర గుంటూరు, కృష్ణా జిల్లాలకు చేరుకున్న సందర్భంలో స్థానిక ఎంపీలు మాత్రం యాత్రకు డుమ్మా కొట్టారు. ఉన్నదే ముగ్గురు ఎంపీలు, అందులో ఇద్దరు రాకపోవడంతో వైరి వర్గాలు సెటైర్లు పేలుస్తున్నాయి. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని.. యాత్రకు రాకపోవడంపై టీడీపీ వర్గాల్లో కూడా గుసగుసలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ యాత్రపై స్పందించారు. ఆ స్పందన కూడా కాస్త విచిత్రంగా ఉంది.
తప్పుడు ప్రచారం చేస్తారా..?
గల్లా జయదేవ్ తన ట్విట్టర్ అకౌంట్లో రెండు ఫొటోలు పోస్ట్ చేశారు. లోకేష్ యాత్రపై తాను కామెంట్లు చేసినట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలకోసం అలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కేవలం తన ఫొటో వాడి అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఆ వార్తలను, వారు అవలంబించిన పద్ధతులను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి మీద, ఆయన తలపెట్టేన పాదయాత్ర మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశానని వాట్సాప్లో మరియు సోషల్ మీడియ లో ప్రచారం చేయడం జరుగుతోంది. ఇవి కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ వార్తల్లో ఏమాత్రం నిజం… pic.twitter.com/opRrE7TLih
— Jay Galla (@JayGalla) August 22, 2023
అసలు సంగతి చెప్పలేదేం..?
అంతా బాగానే చెప్పారు కానీ, గల్లా జయదేవ్ అసలు సంగతి చెప్పలేదని అంటున్నారు టీడీపీ నేతలు. ఇంతకీ ఆయన పాదయాత్రకు రాకపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు. కనీసం యాత్రలో ఒక్కరోజు కూడా గల్లా కనపడలేదు. ఆయన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో జరిగిన మీటింగ్ లకు కూడా రాలేదు. తీరా ఇప్పుడు తప్పుడు ప్రచారం అంటూ ట్వీట్లు వేశారు. ఇందులో కూడా యాత్రకు రాకపోవడానికి గల్లా జయదేవ్ కారణం చెప్పకపోవడం విశేషం. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం పార్టీపై అసంతృప్తితోనే యాత్రకు డుమ్మాకొట్టారని తేలిపోయింది.
*