గజపతిన`గరం` గరంగా తెలుగుదేశం వర్గపోరు - ఆజ్యం పోస్తున్న అశోక్ గజపతిరాజు
అశోక్ గజపతిరాజు సమక్షంలో వైసీపీ నుంచి టిడిపిలో చేరికలు జరిగాయి. అయితే నియోజకవర్గ ఇన్‌చార్జి కేఏ నాయుడు లేకుండా ఈ చేరికలు జరగడం విభేదాలను బయటపెట్టింది. కేఏ నాయుడుకు వ్యతిరేకంగా శివరామకృష్ణ వర్గాన్ని అశోక్ గజపతిరాజు ప్రోత్సహిస్తున్నారని మరో వర్గం గుర్రుగా ఉంది.
ఇటీవలే తెలుగుదేశం పార్టీ అధినేత విజయనగరం జిల్లా పర్యటన విజయవంతం కావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. రాజాం, బొబ్బిలి, గజనపతినగరం, విజయనగరం సభలు జనసంద్రాన్ని తలపించాయి. చంద్రబాబు టూరు హుషారు తగ్గకముందే వర్గపోరు వార్తలు పార్టీ కేడర్‌లో కాక పుట్టిస్తున్నాయి.
గజపతినగరంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో వర్గపోరు తీవ్రం అవుతూ వస్తోంది. గజపతినగరం నియోజకవర్గ ఇన్‌చార్జి కొండపల్లి అప్పలనాయుడు, పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కరణం శివరామకృష్ణల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. శివరామకృష్ణకి మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొండపల్లి అప్పలనాయుడు పనితీరు అంత ఆశాజనకంగా లేదని టిడిపిలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. గజపతినగరం తెలుగుదేశం వర్గపోరుకి అశోక్ బంగ్లా వేదికగా మారడం చర్చనీయాంశం అవుతోంది.
అశోక్ గజపతిరాజు సమక్షంలో వైసీపీ నుంచి టిడిపిలో చేరికలు జరిగాయి. అయితే నియోజకవర్గ ఇన్‌చార్జి కేఏ నాయుడు లేకుండా ఈ చేరికలు జరగడం విభేదాలను బయటపెట్టింది. కేఏ నాయుడుకు వ్యతిరేకంగా శివరామకృష్ణ వర్గాన్ని అశోక్ గజపతిరాజు ప్రోత్సహిస్తున్నారని మరో వర్గం గుర్రుగా ఉంది. బలమైన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యని ఢీకొట్టాలంటే టిడిపి వర్గపోరుని పక్కనబెట్టాల్సి ఉంది. అయితే తమలో తాము గొడవపడుతూ వైసీపీకి మేలు చేకూరుస్తున్న టిడిపి లీడర్లపై కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.