Telugu Global
Andhra Pradesh

జూన్ వరకు లాస్ట్ ఛాన్స్..గడప గడపపై నేడు జగన్ కీలక సమీక్ష

తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వర్క్ షాప్ ఈరోజు జరుగుతుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు.

జూన్ వరకు లాస్ట్ ఛాన్స్..గడప గడపపై నేడు జగన్ కీలక సమీక్ష
X

ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుకి గడప గడప కార్యక్రమం గీటురాయిగా భావిస్తున్నారు సీఎం జగన్. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని, ప్రతి నిత్యం ప్రజలతో మమేకం కావాలని, నియోజకవర్గంలోని ప్రతి గడప తొక్కాలని, వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను నేరుగా వివరించాలని, ఒక్కో కుటుంబానికి ఆర్థిక లబ్ధి ఏమేరకు సమకూరిందో వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించారు. మే 11న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ప్రారంభించారు. ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తూ ఎమ్మెల్యేలకు చురుకు పుట్టిస్తున్న జగన్, తాజాగా మరోసారి సమీక్షకు సిద్ధమయ్యారు.

తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వర్క్ షాప్ ఈరోజు జరుగుతుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో–ఆర్డినేటర్లు ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం నిర్వహణలో ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే జగన్ కు నివేదికలు అందాయి. పలు సర్వేల ఆధారంగా ఆయన సమాచారం సేకరించారు. దీని ప్రకారం ఈ కార్యక్రమంలో కాస్త నిదానంగా ఉన్నవారికి జూన్ వరకు గడువు ఇస్తామంటున్నారు జగన్. ఆలోగా పనితీరు మెరుగుపరచుకోవాలని, గడప గడపను మరింత వేగవంతం చేయాలని సూచించబోతున్నారు.

ఐ ప్యాక్ కి నచ్చకపోతే ప్యాకప్..

ఐ ప్యాక్ తో సర్వేలు చేయిస్తున్న సీఎం జగన్, సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామంటున్నారు. ఇప్పటికే కొంతమందిని పక్కనపెట్టేందుకు ఆయన నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక సమన్వయకర్తలను నియమిస్తూ ఎమ్మెల్యేలకు చెక్ పెడుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ప్రకటిస్తూ అసంతృప్తిని మొదట్లోనే తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

ఎవరెవరికి టికెట్లు..?

ప్రభుత్వంపై వ్యతిరేకత ఏమాత్రం లేదు అనేది వైసీపీ అభిప్రాయం. ఈసారి 175 నియోజకవర్గాల్లో గెలుపు ఖాయం అనే ధీమా కూడా జగన్ కి ఉంది. వైనాట్ 175 అంటూ ఆయన ఆల్రడీ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఈ టార్గెట్ ని అందుకునే క్రమంలో సిట్టింగ్ లకు సీట్లు గల్లంతవుతాయనే ప్రచారం కూడా ఉంది. ప్రభుత్వంపై ప్రజలకు సదభిప్రాయమే ఉన్నా, స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థులు బలహీనంగా ఉంటే పార్టీకే నష్టం అని భావిస్తున్నారు సీఎం జగన్. కొంతమందికి స్థాన చలనం తప్పదు, కొన్నిచోట్ల సిట్టింగ్ లకు సీట్లు దక్కవనే ప్రచారం కూడా ఉంది. అయితే అన్నిటికీ మూలం గడప గడప కార్యక్రమమే కావడం విశేషం. ఈ కార్యక్రమం నిర్వహించడంలో ఎవరి పర్ఫామెన్స్ ఎలా ఉందనేదాన్నిబట్టి టికెట్ల కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది.

First Published:  16 Dec 2022 7:57 AM IST
Next Story