ఢిల్లీ మెట్రో కోసం ఫ్రెంచ్ కంపెనీ బోగీలు.. ఏపీలో తయారీ
ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీలోని ఆల్ స్టోమ్ అర్బన్ రోలింగ్ స్టాక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైట్ లో ఈ 312 మెట్రో కార్లను సిద్ధం చేస్తామని తెలిపారు ఫ్రెంచ్ కంపెనీ ప్రతినిధులు.
ఢిల్లీ మెట్రో ఫేజ్-4 కోసం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 312 మెట్రో కార్ల (మెట్రో బోగీల) తయారీకోసం ఈ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. త్వరలో దీనికి సంబంధించిన పని మొదలు పెడతామని తెలిపారు ఆల్ స్టోమ్ ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీలోని ఆల్ స్టోమ్ అర్బన్ రోలింగ్ స్టాక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైట్ లో ఈ 312 మెట్రో కార్లను సిద్ధం చేస్తామని తెలిపారు.
ముకుంద్ పూర్ – మౌజ్ పూర్, జనక్ పురి వెస్ట్ –ఆర్కే ఆశ్రమ్ కారిడార్.. మధ్యలో కొత్తగా ఢిల్లీ మెట్రో సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ ఇక్కడ వృక్షాల తొలగింపు పెద్ద అడ్డంకిగా మారింది. అయితే ఇక్కడ తొలగించి వృక్షాలను అదే స్థితిలో మరోచోట నాటేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 185 వృక్షాలను తరలించడంతోపాటు 3,160 కొత్త మొక్కలను నాటి నగర వనాన్ని ప్రత్యామ్నాయంగా చేపట్టబోతున్నారు. దీంతో ఫేజ్-4కి లైన్ క్లియర్ అయింది.
ఇప్పటికే ఢిల్లీ మెట్రో కోసం 800 మెట్రో కార్లను ఆల్ స్టోమ్ కంపెనీ అందించింది. ప్రస్తుతం ఇవి ఢిల్లీ మెట్రో కారిడార్ లో పరుగులు తీస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు ఫేజ్-4కోసం 312 మెట్రో కార్లు తయారు కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇవి తయారు కాబోతుండటం విశేషం.