ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఆలస్యం.. కారణం ఏంటంటే..?
తెలంగాణలో ఉచిత రవాణా జెట్ స్పీడ్ లో అమలులోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆరు రోజులకు, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండురోజుల్లోనే ఈ పథకం పట్టాలెక్కింది. కానీ ఏపీలో మాత్రం ఆలస్యమవుతోంది.
2023 డిసెంబర్ 3 - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల..
2023 డిసెంబర్ 7 - ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.
2023 డిసెంబర్ 9 - మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలు..
ఇక ఏపీ విషయానికొస్తే..
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్-4, 2024
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జూన్-12, 2024
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం అమలు - ???
తెలంగాణలో ఉచిత రవాణా జెట్ స్పీడ్ లో అమలులోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆరు రోజులకు, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండురోజుల్లోనే ఈ పథకం పట్టాలెక్కింది. కానీ ఏపీలో మాత్రం ఆలస్యమవుతోంది.
ఎన్నికల ముందు టీడీపీ హామీల్లో ఆకర్షణీయంగా కనిపించిన పథకం మహిళల ఉచిత ప్రయాణం. మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత హడావిడిగా పెట్టిన ఐదు సంతకాల్లో ఉచిత ప్రయాణం ప్రస్తావన లేదు. ఆ మాటకొస్తే ఈ పథకంపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తుందా లేదా అనేది కూడా తేలడంలేదు. ఉచిత ప్రయాణం హామీ అమలుపై కసరత్తు చేస్తున్నామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అది మినహా పురోగతి లేదు. అంటే ఉచిత రవాణా అందుబాటులోకి రావడం మరింత ఆలస్యమవుతుందనే విషయం మాత్రం స్పష్టమైంది.
ఇప్పటికిప్పుడు ఉచిత రవాణా అమలైతే ఏపీ రూపురేఖలేవీ మారిపోవు, కానీ మహిళలు మాత్రం ఆ పథకం ఎప్పట్నుంచి అమలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఆటో డ్రైవర్లు తమకు ఉపాధి పోతుందనే భయాందోళనలో ఉన్నారు. అందుకే దీనిపై చర్చలు జరగాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉంది.
తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. ఏపీలో మాత్రం కొర్రీలు వేసేలా ఉన్నారు. బాబు ప్రకటించింది జిల్లా వరకేనంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కనీసం అదయినా ప్రభుత్వం చెప్పడంలేదు. కర్నాటక, తెలంగాణలో అధ్యయనం చేసి, ఏపీలో అమలు చేస్తామని ప్రభుత్వం చెబితే మాత్రం అమలు వాయిదా పడినట్టే లెక్క. మరి ఏపీలో అక్కచెల్లెమ్మల ఉచిత ప్రయాణం ఎలా మొదలవుతుందో, ఎప్పట్నుంచి మొదలవుతుందో వేచి చూడాలి.