ఏపీ మహిళలకు శుభవార్త.. నెలరోజుల్లో ఉచిత ప్రయాణం
తెలంగాణ, కర్నాటకలో ఈ పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహించి.. ఏపీలో ఎవరికీ అసౌకర్యం కలగకుండా ఈ స్కీమ్ అమలు చేస్తామన్నారు రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి.

ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న మహిళలకు శుభవార్త. నెలరోజుల్లోగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. రవాణా, యువత, క్రీడల శాఖ మంత్రిగా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తనకు కీలకమైన మూడు శాఖలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై తొలి సంతకం చేశారాయన. ఆర్టీసీలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు మంత్రి.
ప్రస్తుతం తెలంగాణ, కర్నాటకలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ హామీ అమలులో ఉందని చెప్పారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఆ రెండు రాష్ట్రాల్లో ఆ పథకం అమలు తీరుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ హామీ అమలులో ఎదురయ్యే సమస్యలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఎవరికీ నష్టం జరగకుండా, ఏ ఒక్కరికీ అసౌకర్యం కలగకుండా ఈ పథకం అమలు చేస్తామన్నారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి.