ఏపీలో నేటినుంచి ఇసుక ఉచితం.. కండిషన్స్ అప్లై
ఈరోజు నుంచి ఏపీలోని 20 జిల్లాల్లో ఉచిత ఇసుక విధానం అమలులోకి వస్తోంది. ఇప్పటి వరకు ఇసుక అమ్మకాల్లో కేవలం నగదు లావాదేవీలు జరుగగా, ఈరోజు నుంచి డిజిటల్ చెల్లింపులను కూడా అంగీకరిస్తారు.
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వినిపించిన ప్రధాన ఆరోపణ.. ఇసుక రేట్లు భారీగా పెరిగిపోవడం. అంతకు ముందు ఉన్న రేట్ల కంటే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇసుక రేట్లు పెరిగాయి, తద్వారా నిర్మాణ వ్యయం కూడా పెరిగింది. కొన్నాళ్లు భవన నిర్మాణ కార్మికులకు కూడా పనులు దూరమయ్యాయనే ఆరోపణలున్నాయి. ఆ విషయంలో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టకపోవడంతోపాటు.. థర్డ్ పార్టీ ద్వారా ఇసుక అమ్మకాలు కొనసాగించడంతో ఎన్నికల్లో ఆ ప్రభావం కనపడింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పులు తీసుకొచ్చింది. నేటినుంచి ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది.
ఉచిత ఇసుక అంటే..?
నదీ పరివాహక ప్రాంతాల్లో లభ్యమయ్యే ఇసుకను తవ్వి తీయడానికి అయ్యే ఖర్చు, రవాణా ఖర్చు, ఇసుక యూనిట్ ఖర్చు.. ఈ మూడూ ఇప్పటి వరకు ఉండేవి. ఇప్పుడు ఇసుక యూనిట్ ఖర్చుని తొలగిస్తారు. కేవలం ఇసుక తవ్వితీయడానికి అయిన ఖర్చు, రవాణా ఖర్చుని మాత్రమే వినియోగదారుడి వద్ద వసూలు చేస్తారు. అంటే కచ్చితంగా ఇసుక రేటు తగ్గుతుంది. వినియోగదారుడికి అంతిమ ప్రయోజనం లభిస్తే ప్రభుత్వంపై ప్రజల దృక్పథం మారుతుంది.
కూటమి సాహసం..
మద్యం అమ్మకం, ఇసుక అమ్మకం సహా ఇతర రంగాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఆ ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. కానీ ఏపీలో విరివిగా సంక్షేమ హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం ఇసుకపై వచ్చే ఆదాయాన్ని వదులుకోడానికి సిద్ధపడింది. అంటే ఇది సాహసమనే చెప్పాలి. దీనివల్ల ప్రజల్లో ప్రభుత్వానికి మైలేజీ పెరుగుతుంది. హామీల అమలు కాస్త ఆలస్యమైనా పెద్దగా వ్యతిరేకత రాదు, ఆ మాటకొస్తే కొన్ని హామీలు అమలు చేయలేకపోయినా.. కారణం ఉచిత ఇసుక అని చెప్పుకోవచ్చు. దీంతో కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ప్రయోగం చేస్తోంది.
ఈరోజు నుంచి ఏపీలోని 20 జిల్లాల్లో ఉచిత ఇసుక విధానం అమలులోకి వస్తోంది. ఇప్పటి వరకు ఇసుక అమ్మకాల్లో కేవలం నగదు లావాదేవీలు జరుగగా, ఈరోజు నుంచి డిజిటల్ చెల్లింపులను కూడా అంగీకరిస్తారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయి, వాటిలో ఎంతమేర ఇసుక అందుబాటులో ఉందనే వివరాలను గనుల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అధికారులు పొందుపరిచారు, ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటారు. 2014-19 మధ్య కాలంలో ఇసుక విషయంలో టీడీపీ ప్రభుత్వం పలు ప్రయోగాలు చేసింది. ఇప్పుడు మరోసారి ఇసుకను ఉచితంగా అందిస్తామంటోంది. ఈసారి ఉచిత ఇసుక విధానం ప్రభుత్వానికి ఏమేరకు ప్రయోజనకారి అవుతుందో వేచి చూడాలి.