ఉద్యోగాల పేరిట లక్షల్లో మోసం.. - డబ్బులడిగితే రౌడీలతో చంపిస్తామని బెదిరింపు
నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి ఉద్యోగమూ రాకపోవడంతో తాము మోసపోయామని గుర్తించిన సోదరులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని నిలదీయగా, రౌడీలను పెట్టి చంపిస్తామని బెదిరించారు.
ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న సోదరులకు రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించడంతో ఆశ పడ్డారు. ఆశ చూపినవారిలో ఒకరు గుంటూరులో రైల్వే శాఖలో ఉద్యోగి కావడం, మరో ఇద్దరు అతనికి చెందినవారే కావడంతో వారికి నమ్మకం కుదిరింది. డబ్బు ఖర్చయినా లైఫ్ సెటిలైపోతుందనే ఆశతో లక్షలు చెల్లించేందుకూ సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఒక్కొక్కరు రూ.15 లక్షలు చొప్పున ఇద్దరూ కలిసి రూ.30 లక్షల వరకు వారికి అందజేశారు. వారితో పాటు మరో వ్యక్తి కూడా వారిని నమ్మి రూ.13 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత ఉద్యోగాలు రాకపోవడంతో.. నిలదీసి.. తమ డబ్బు ఇవ్వాలని అడిగితే.. రౌడీలతో చంపిస్తామని బెదిరించారు. దీంతో బాధితులు సోమవారం గుంటూరు పోలీసులను ఆశ్రయించారు.
టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని...
ఈ ఘటనపై పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు భవానీపురానికి చెందిన అన్నదమ్ములు రవీంద్ర, రాజు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. వారిలో ఒకరు ఇంటర్, మరొకరు బీఈడీ చదివారు. గుంటూరులో రైల్వే శాఖలో పనిచేస్తున్న ఓ వ్యక్తి, అతనికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించారు. అదీ టికెట్ కలెక్టర్ (టీసీ) ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపారు. అయితే ఇందుకు గాను ఒక్కొక్కరు రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని, వారణాసి రైల్వే జోన్‌లో పోస్టింగ్ ఇప్పిస్తామని నమ్మబలికారు.
వైద్య పరీక్షలు, ఇంటర్వ్యూ అంటూ...
అతని మాటలు నమ్మిన సోదరులిద్దరూ ఒక్కొక్కరూ రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు ముందుగా వారికి అందజేశారు. దీంతో వారిని వైద్య పరీక్షల పేరుతో ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడి రైల్వే ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. దీంతో ఆ పరీక్షలు ఉద్యోగం కోసమే అని అన్నదమ్ములిద్దరూ భావించారు. అక్కడ వీరికి మహేష్ అనే యువకుడు పరిచయమైతే అతనికి కూడా రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అతని నుంచి రూ.13 లక్షలు రవీంద్ర ఖాతాకు జమ చేయించి తీసుకున్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ అంటూ హైదరాబాద్, వారణాసికి తీసుకెళ్లారు.
ఉద్యోగం వచ్చిందంటూ నకిలీ గుర్తింపు కార్డులు ఇచ్చి..
ఆ తర్వాత ఉద్యోగం వచ్చేసిందంటూ వారికి నకిలీ గుర్తింపు కార్డులు అందజేశారు. వారి నుంచి మిగిలిన రూ.5 లక్షలు కూడా వసూలు చేశారు. త్వరలో పోస్టింగ్ వచ్చేస్తుందని చెప్పారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్ సాకు చూపుతూ కాలం వెళ్లబుచ్చారు.
డబ్బులివ్వాలని నిలదీస్తే.. చంపేస్తామంటూ..
నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో అనుమానం వచ్చిన సోదరులు వారిని అడిగితే.. ఉద్యోగం ఇప్పించాల్సిన రైల్వే అధికారులను విజిలెన్స్ పోలీసులు పట్టుకున్నారని, ఈసారి పోలీసు శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. ఆ పేరుతో విజయవాడకు తీసుకెళ్లి అక్కడ ఇంటర్వ్యూలని నమ్మించారు. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి ఉద్యోగమూ రాకపోవడంతో తాము మోసపోయామని గుర్తించిన సోదరులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని నిలదీయగా, రౌడీలను పెట్టి చంపిస్తామని బెదిరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన బాధితులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై గుంటూరు ఏఎస్‌పీ శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు.