Telugu Global
Andhra Pradesh

పులి పిల్లల కథ సుఖాంతం..

చివరకు వాటి సంరక్షణ ఇబ్బందిగా మారింది. తల్లిపాలు లేక అవి బక్కచిక్కిపోతున్నాయి. దీంతో పులి పిల్లల విషయంలో ఉన్నతాధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

పులి పిల్లల కథ సుఖాంతం..
X

వారం రోజులుగా తెలుగు మీడియా పులి పిల్లలపై ఫోకస్ పెట్టింది. పులి పిల్లలు అనాథలయ్యాయని, తల్లికోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయని, అసలింతకీ ఆ తల్లి ఎక్కడికిపోయిందని హడావిడి చేశాయి టీవీ ఛానెళ్లు. బిడ్డల్ని కని వదిలేసి వెళ్లిపోయే జాడ్యం జంతువులకు కూడా సోకిందని సోషల్ మీడియాలో కొంతమంది సెటైరికల్ కామెంట్లు కూడా పెట్టారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఆ పులిపిల్లల కథ సుఖాంతమైంది. ఆ పిల్లల్ని తిరుపతి జూ పార్క్ కి తరలించారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో పులి పిల్లలు గ్రామస్తులకు కనిపించాయి. పిల్లలతో పాటు దారి తప్పి గ్రామం వైపు వచ్చిన పెద్దపులి ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆ పిల్లల్ని గ్రామస్తులు సంరక్షించారు. అయితే అదే సమయంలో ఏ క్షణంలో పిల్లలకోసం పెద్దపులి వస్తుందోనని వారం రోజులుగా కంటిమీద కునుకు లేకుండా గడిపారు. ఫారెస్ట్ అధికారులు తల్లి పులి కోసం జల్లెడపట్టారు. పిల్లలను తల్లి దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నించారు. వాటిని అలాగే అడవిలో వదిలేస్తే ప్రమాదమని భావించి గ్రామస్తుల వద్దే కొన్నిరోజులపాటు ఉంచారు. చివరకు వాటి సంరక్షణ ఇబ్బందిగా మారింది. తల్లిపాలు లేక అవి బక్కచిక్కిపోతున్నాయి. దీంతో పులి పిల్లల విషయంలో ఉన్నతాధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. వాటిని తిరుపతిలోని జూ పార్క్ కి తరలించారు.

ప్రస్తుతం ఆ పులి పిల్లల వయసు 50రోజులుగా నిర్థారించారు. వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో వాటి ఆరోగ్య పరిస్థితి పరిశీలించారు. తల్లిపాలు లేక అవి బలహీనంగా ఉన్నట్టు గుర్తించారు. వాటికి బలవర్థకమైన ఆహారాన్ని అందజేస్తామని చెప్పారు. ఎండాకాలం కావడంతో పులులు వేడి తట్టుకోలేవని, అందులోనూ పిల్లలను మరింత జాగ్రత్తగా కాపాడాల్సిన అవసరం ఉందని అంటున్నారు జూ పార్క్ అధికారులు. వాటిని ఏసీలతో సంరక్షిస్తామంటున్నారు. తల్లి సంరక్షణలో ఉండాల్సిన పిల్లలు ఇప్పుడు జూ పార్క్ కి చేరుకోవడం విశేషం.

First Published:  10 March 2023 2:26 PM IST
Next Story