Telugu Global
Andhra Pradesh

సముద్రంలో కొట్టుకుపోయిన ఏపీ విద్యార్థులు.. - ఒకరు మృతి.. నలుగురు గల్లంతు

ఈ ఘటనలో ప్రమాదానికి గురైన 10 మందిలో ఐదుగురు ప్రాణాలతో బయటపడగా.. ఓ విద్యార్థి మరణించాడు. మిగిలిన నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు.

సముద్రంలో కొట్టుకుపోయిన ఏపీ విద్యార్థులు.. - ఒకరు మృతి.. నలుగురు గల్లంతు
X

ఏపీ విద్యార్థుల విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకరు మృతిచెందగా, నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు వేర్వేరుగా విహార యాత్ర కోసం మహాబలిపురం వెళ్లారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని ఎస్వీసీఆర్‌ ప్రభుత్వ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులతో పాటు ఏడుగురు విద్యార్థినులు ఒక బృందంగా వెళ్లగా, అనంతపురం జిల్లా బోయరెడ్డిపల్లిలోని పెన్నా కాలేజ్‌ ఆఫ్‌ సిమెంట్‌ సైన్సెస్‌కు చెందిన మరో 22 మంది విద్యార్థులు, నలుగురు అధ్యాపకులు మరో బృందంగా వెళ్లారు.

వీరిలో కొంతమంది విద్యార్థులు మహాబలిపురం శిల్ప సంపదను వీక్షించేందుకు వెళ్లగా.. మరికొంతమంది సీ షోర్‌ టెంపుల్‌ వద్ద ఉదయం 8.30 సమయంలో సముద్ర స్నానానికి వెళ్లారు. 10 మంది విద్యార్థులు సముద్ర స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వారిని చుట్టుముట్టిన భారీ అల వారందరినీ సముద్రంలోకి లాక్కెళ్లింది. ఈ క్రమంలో అక్కడే సహచర విద్యార్థులు, సందర్శకులు కేకలు పెట్టగా, అక్కడే ఉన్న జాలర్లు తక్షణం స్పందించి తొలుత అతి కష్టం మీద నలుగురిని కాపాడగలిగారు. ఆ తర్వాత మరో ఇద్దరిని ఒడ్డుకు చేర్చగా.. వారిలో ఎస్వీసీఆర్‌ కళాశాల విద్యార్థి విజయ్‌ (18) మృతిచెందాడు. కార్తీక్‌ అనే విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకున్నాడు.

ఈ ఘటనలో ప్రమాదానికి గురైన 10 మందిలో ఐదుగురు ప్రాణాలతో బయటపడగా.. ఓ విద్యార్థి మరణించాడు. మిగిలిన నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. వీరి జాడ కోసం అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, కోస్టుగార్డు, జాలర్లు తీవ్రంగా గాలిస్తున్నారు. తమతో వచ్చిన విద్యార్థులు గల్లంతవడంతో సహచర విద్యార్థులు, విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. గల్లంతైన వారిలో పెన్నా కళాశాలకు చెందిన చిక్కం శేషారెడ్డి, యతిరాజ్, చిత్తూరు ఎస్వీసీఆర్‌ కళాశాలకు చెందిన మోనీష్‌. పార్థీ ఉన్నారు. ఈ ఘటనపై మహాబలిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  3 March 2024 11:28 AM IST
Next Story