Telugu Global
Andhra Pradesh

వైసీపీని ఫాలో అవ్వాల్సిందేనా ?

ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. కాబట్టి వచ్చే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి విశాఖకు వెళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇష్టమున్నా లేకపోయినా చంద్రబాబు, పవన్ కూడా విశాఖకు వెళ్ళాల్సిందే.

వైసీపీని ఫాలో అవ్వాల్సిందేనా ?
X

అదేదో సినిమాలో 'నేను ట్రెండ్‌ను ఫాలో అవ్వను..సెట్ చేస్తాను' అని చెప్పినట్లుగా ఉంది అధికార వైసీపీ వ్యవహారం. తొందరలోనే పార్టీల హెడ్ ఆఫీసులు విశాఖపట్నంకు తరలి వెళ్ళాల్సిందే అన్నట్లుగా ఉంది. కారణం ఏమిటంటే బుధవారం విశాఖపట్నంలో వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మాణానికి శంకుస్ధాపన జరిగింది కాబట్టే. ఏడు నెలల్లో ఆఫీసు నిర్మాణం పూర్తియపోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రస్తుతం వైసీపీ హెడ్ ఆఫీసు అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

వైసీపీ తాజా నిర్ణయంతో మిగిలిన పార్టీలు కూడా తమ కేంద్ర కార్యాలయాలను విశాఖపట్నంకు తరలించక తప్పేట్లు లేదు. మామూలుగా జిల్లాల్లో పార్టీల ఆఫీసులు చిన్నవిగా ఉంటాయి. అదే రాజధానిలో అయితే అవసరాలకు తగ్గట్లుగా బాగా పెద్దవిగా ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేనలు తమ ఆఫీసులను గుంటూరు, మంగళగిరిలో ఇలాగే ఏర్పాటు చేసుకున్నాయి. బీజేపీ కూడా విజయవాడలో పెద్ద ఆఫీసును తీసుకుంది. మిగిలిన కాంగ్రెస్, వామపక్షాల ఆఫీసులు ఎక్కడున్నా ఒకటే అన్నట్లుగా ఉంది.

విశాఖ నగరంలోని ఎందాడ ప్రాంతంలోని పనోరమా హిల్స్ లో హెడ్ ఆఫీసు నిర్మాణం మొదలైంది. టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో శంకుస్ధాపన జరిగింది. అధికారంలో ఉంది కాబట్టి పార్టీ హెడ్డాఫీసును వెంటనే కట్టేసుకోవటం పెద్ద సమస్యేమీ కాదు. మరి టీడీపీ, జనసేనలదే సమస్యంతా. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని. కాబట్టి వచ్చే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి విశాఖకు వెళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దాదాపు విశాఖ రాజధాని అయిపోయినట్లే అనుకోవాలి. జగన్ విశాఖలో ఉంటారు కాబట్టి ప్ర‌ధాన‌ మీడియా దృష్టంతా విశాఖ మీదే ఉంటుంది.

ముఖ్యమంత్రి, మీడియా విశాఖలో ఉన్నతర్వాత చంద్రబాబు, పవన్ అమరావతి ప్రాంతంలో చేయటానికి ఏమీ ఉండదు. ఇష్టమున్నా లేకపోయినా వీళ్ళు కూడా విశాఖకు వెళ్ళాల్సిందే. రాజధాని వివాదంపై విచారణ సందర్భంగా సుప్రిం కోర్టు జడ్జీలు ఈ మధ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా అధికార పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చినట్లుంది. అందుకనే వివాదంపై విచారణ జరుగుతుండగానే హెడ్డాఫీసు నిర్మాణ పనులు మొదలుపెట్టేశారు. నిర్మాణాలకు ప్రైవేటు స్ధలాన్ని తీసుకున్నారు కాబట్టి ఏదో ఒకరోజు టీడీపీ, జనసేన కూడా ప్రైవేటు స్ధలాన్ని తీసుకుని మళ్ళీ నిర్మాణాలు చేసుకోవాల్సిందేనేమో.

First Published:  15 Dec 2022 11:38 AM IST
Next Story