జనసేన తీర్థం పుచ్చుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే
పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు

కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దొరబాబు జనసేన పార్టీలో చేరికతో పవన్ కల్యాణ్ ఒకే దెబ్బకు రెండు పిట్టల మాదిరి వ్యూహం పన్నారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మతోపాటు వైసీపీకి ఊహించని దెబ్బను పవన్ కల్యాణ్ తీశారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేర్చుకున్నారు. పిఠాపురంలో తనకు తిరుగులేదని నిరూపించుకునేందుకు పవన్ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనమండలిలో జనసేన విప్ హరిప్రసాద్, జనసేన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. కాగా, పెండెం దొరబాబుతో పాటు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఇతర వైసీపీ నేతలు కూడా జనసేన పార్టీలోకి వచ్చారు. వారికి నాదెండ్ల మనోహర్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఇవాళ జనసేనలో చేరిన వారిలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొత్తపల్లి పద్మ బుజ్జి, గొల్లప్రోలు మార్కెట్ కమిటీ చైర్మన్ మొగిలి వీర వెంకట సత్యనారాయణ కూడా ఉన్నారు.