దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా బాబు మాటలు.. - ఉండవల్లి అరుణ్‌కుమార్
సీఎం జగన్ పట్ల పట్టణ ప్రాంతాల్లో చదువుకున్నవారు కొంత వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవమేనని, కానీ వైసీపీ లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయని ఉండవల్లి చెప్పారు.
చంద్రబాబు చెబుతున్న మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాలతో రాష్ట్రం దివాలా తీస్తోందని విమర్శించిన చంద్రబాబే.. తాను అంతకంటే ఎక్కువ డబ్బులు పంచుతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తానంటున్న చంద్రబాబు హామీలను రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదని ఆయన స్పష్టంచేశారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ చరిత్ర ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేదు
సీఎం జగన్ పట్ల పట్టణ ప్రాంతాల్లో చదువుకున్నవారు కొంత వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవమేనని, కానీ వైసీపీ లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయని ఉండవల్లి చెప్పారు. రాష్ట్ర జనాభాలో 40 శాతానికి పైగా ప్రజలు సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారని, వాళ్లందరూ ఈసారి ఎన్నికల్లో వైసీపీకే పట్టం కడతారన్న నమ్మకం ఆ పార్టీకి ఉందని ఆయన తెలిపారు. ఇక.. సంక్షేమ పథకాలకు ఇంత పెద్దమొత్తంలో నగదు బదిలీ చేసిన చరిత్ర ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు.
బాబొస్తే.. పథకాలు రద్దవుతాయనే అవగాహన ప్రజలకు ఉంది
జగన్ కాకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ రద్దవుతాయని, తాము నష్టపోతామనే అవగాహన కూడా ప్రజలకు ఉందని ఈ సందర్భంగా ఉండవల్లి తెలిపారు. అందుకే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకోవాలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని ఆయన చెప్పారు. జగన్ తన ప్రచారంలో ఒక క్లారిటీ ఇస్తున్నారని, 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నది వైసీపీ అభ్యర్థులు కారని, తానే స్వయంగా చేస్తున్నట్లు భావించి ఓట్లు అభ్యర్థిస్తున్నారని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్‌కు ఉన్న ధైర్యం ఏమిటో తనకు అర్థం కావడం లేదని ఆయన చెప్పారు.