Telugu Global
Andhra Pradesh

రామోజీ తెలివితేటలకు భారతరత్న ఇవ్వాలి- ఉండ‌వ‌ల్లి

ఇండియాలో ఉన్న బ్యాంకులు రామోజీకి అప్పగిస్తే.. ఈ నైపుణ్యంతో అద్భుతంగా నడిపిస్తారేమో అంటూ చ‌లోక్తులు విసిరారు.

రామోజీ తెలివితేటలకు భారతరత్న ఇవ్వాలి- ఉండ‌వ‌ల్లి
X

రామోజీరావు తెలివితేట‌ల‌కు ప‌ద్మ విభూష‌ణ్ కాదు, భార‌తర‌త్న ఇవ్వాల‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ అన్నారు. మార్గ‌ద‌ర్శి కేసులో రామోజీ రావు వైఖ‌రి `లా` విద్యార్థుల‌కు గొప్ప కేస్ స్ట‌డీ అవుతుంద‌న్నారు. డిసెంబర్ 2న మార్గదర్శి కేసు విచారణ మొద‌లైతే, డిపాజిట్ల సేకరణ ఆపేసినట్లు 2006లో రామోజీ చెప్పారని ఆయ‌న గుర్తుచేశారు. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని హైకోర్టు, సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేశారు కానీ.. ఇప్పటికీ డిపాజిట్లు వసూలు చేస్తూనే ఉన్నారని ఉండ‌వ‌ల్లి గుర్తుచేశారు. చ‌ట్టాన్ని ఉల్లంఘించి రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్ పేరిట డబ్బులు సేకరించార‌ని, ఇప్పుడు కూడా డిపాజిట్ల పేరుతో కాకుండా రిసీట్ అని సేకరిస్తున్నార‌న్నారు.

కానీ, ఇప్ప‌టివ‌ర‌కు మార్గదర్శికి 3 శాతం కూడా డీ ఫాల్టర్లు లేర‌ని, ఇందులో కిటుకు ఏంట‌ని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఔట్ స్టాండింగ్ రూ.139 కోట్లుగా చూపించారని, ఈ నైపుణ్యం రామోజీకి మాత్ర‌మే సాధ్య‌మ‌న్నారు. ఇండియాలో ఉన్న బ్యాంకులు రామోజీకి అప్పగిస్తే.. ఈ నైపుణ్యంతో అద్భుతంగా నడిపిస్తారేమో అంటూ చ‌లోక్తులు విసిరారు. మార్గదర్శి చైర్మన్‌ ఇప్పటికీ రామోజీనే.. కానీ, కోర్టులో మాత్రం నేను చైర్మన్ కాదంటార‌ని, మార్గ‌ద‌ర్శి కేసులో రామోజీ త‌ప్పు చేశారా.. లేదా..? అన్న‌దే ప్ర‌ధానంగా వాదించాల‌న్నారు.

ఇండస్ట్రీలిస్టుగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ.. మీడియాను వాడుకుంటున్నార‌న్నారు. రామోజీకి రెండు టోపీలు ఉన్నాయని సుప్రీం జడ్జి చెప్పార‌ని, రామోజీకి ఉన్న రెండు టోపీల్లో ఒకటి మీడియా.. రెండోది ఇండస్ట్రీలిస్ట్ అన్నారు. ఇన్ని తెలివితేట‌లున్న రామోజీకి భార‌తర‌త్న ఇవ్వాల‌ని ఉండ‌వ‌ల్లి అన్నారు. మార్గ‌ద‌ర్శి సంస్థ‌ల‌పై రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా తనిఖీలు నిర్వహించింద‌ని ఉండ‌వ‌ల్లి అభినందించారు.

First Published:  19 Nov 2022 7:51 AM GMT
Next Story