Telugu Global
Andhra Pradesh

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దు.. - మాజీ ఎంపీ ఉండవల్లి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార ధోరణితో మాట్లాడుతున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కుపై ప్రజాఉద్యమం సాగాలని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దు.. - మాజీ ఎంపీ ఉండవల్లి
X

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయకుండా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఆలోచించాలని కోరారు. ఆదివారం విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో సదస్సు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో మహా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేడీ లక్ష్మీ నారాయణ, నటుడు ఆర్. నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార ధోరణితో మాట్లాడుతున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కుపై ప్రజాఉద్యమం సాగాలని పేర్కొన్నారు. అన్ని పార్టీలు ఎజెండా పక్కనపెట్టి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రులంటే ఆరంభశూరులు కాదు.. ప్రారంభవీరులని కేంద్రం గుర్తుపెట్టుకోవాలన్నారు.

మరోవైపు ఉండవల్లిపై అప్పుడే బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఉండవల్లి ఊసరవెల్లిలా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై చాలా రోజులుగా రాష్ట్రంలో ఉద్యమాలు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రైవేటీకరణ నిర్ణయం పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇటు జనసేన, అటు టీడీపీ వెనకాడుతున్నాయి.

ఈ వివాదంలోకి రాష్ట్రాన్ని లాగి విమర్శలు గుప్పించాలని ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చాలా రోజులుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ వారికి రాజకీయంగా మద్దతు లభించే పరిస్థితులు లేవు. దీంతో ఈ ఉద్యమం పెద్దగా లైమ్ లైట్ లోకి రావడం లేదు. తాజాగా ఈ ఉద్యమంపై ఉండవల్లి అరుణ్ కుమార్, జేడీ లక్ష్మీ నారాయణ ఫోకస్ చేయడం గమనార్హం. వీరు ఎంతకాలం చేస్తారో వేచి చూడాలి.

First Published:  21 Nov 2022 8:43 AM IST
Next Story