చంద్రబాబుకు ఉండవల్లి వార్నింగ్?
జగన్‌ను ఓడించాలని చంద్రబాబుకు బలంగా ఉంటే జనసేనతో పొత్తు పెట్టుకోవటం తప్ప వేరేదారి లేదని తేల్చేశారు. పొత్తు పెట్టుకోవాలంటే సీట్ల షేరింగ్ కాదని పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే జనసేన పొత్తుకు ముందుకొస్తుందన్నారు.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల తర్వాత టీడీపీ భవిష్యత్తు ఎలాగుండబోతోందనే విషయంలో మీడియాతో మాట్లాడుతూ ఉండవల్లి వార్నింగ్ ఇచ్చినట్లే ఉంది. 2024 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ భవిష్యత్తు ఏమిటనే విషయాన్ని మాజీ ఎంపీ ఆవిష్కరించారు. టీడీపీ భవిష్యత్తుపై ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తోంది.
ఇంతకీ ఉండవల్లి చెప్పిందేమంటే టీడీపీ గనుక వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే రెండోసారి కూడా ఘోర ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు దేనికదే పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని కూడా అన్నారు. జగన్‌ను ఓడించాలని చంద్రబాబుకు బలంగా ఉంటే జనసేనతో పొత్తు పెట్టుకోవటం తప్ప వేరేదారి లేదని తేల్చేశారు. పొత్తు పెట్టుకోవాలంటే సీట్ల షేరింగ్ కాదని పవన్ కల్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే జనసేన పొత్తుకు ముందుకొస్తుందన్నారు.
చంద్రబాబు-పవన్ భేటీలో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే పొత్తుకు రెడీ అని పవన్ స్పష్టంగా చెప్పినట్లు ఉండవల్లి చెప్పారు. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించటం మినహా చంద్రబాబుకు వేరే దారి కూడా లేదని మాజీ ఎంపీ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ఓడిపోయినా పవన్‌కు వచ్చే నష్టం ఏమీలేదన్నారు. కానీ చంద్రబాబు పరిస్ధితి మాత్రం అలాకాదన్నారు.
వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోతే పార్టీని జగన్ భూస్ధాపితం చేసేయటం ఖాయమని హెచ్చరించారు. ప్రతిపక్షాలను జగన్ చీల్చి చెండాడేస్తారని చెప్పారు. ఆ పరిస్ధితి రాకుండా ఉండాలంటే పవన్‌ను సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ఒప్పుకుని తీరాల్సిందే అని బల్ల గుద్దకుండానే చెప్పేశారు. ఉండవల్లి జోస్యానికి, హెచ్చరికలకు మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య రాసిన ఓపెన్ లెటర్ బలమిస్తోంది. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే టీడీపీ-జనసేన పొత్తుకు కాపు సంక్షేమ సేన మద్దతిస్తుందని జోగయ్య కండీషన్ పెట్టారు. నిజానికి ఇదే ఆలోచన చాలామంది కాపుల్లో నడుస్తోంది. మరి ఉండవల్లి హెచ్చరికలు, జోగయ్య కండీషన్‌పై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.