Telugu Global
Andhra Pradesh

రాజధాని ప్రాంతంలో టీడీపీకి మరో షాక్‌.. రాయపాటి గుడ్‌బై..!

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రావు శ్రీ కృష్ణదే వరాయలు చేతిలో ఓడిపోయారు. వయోభారం కారణంగా తను తప్పుకుని కొడుకుని రాజకీయాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు రాయపాటి.

రాజధాని ప్రాంతంలో టీడీపీకి మరో షాక్‌.. రాయపాటి గుడ్‌బై..!
X

విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా నుంచి తేరుకోకముందే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అండ్‌-కోకు మరో బిగ్‌ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. స్టేట్‌ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్టుతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రంగారావు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో పని చేయలేనని స్పష్టం చేశారు రంగారావు. తన నిర్ణయాన్ని గౌరవించాలని లేఖలో కోరారు.

ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి 4 సార్లు ఎంపీగా గెలుపొందిన రాయపాటి సాంబశివరావు.. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్‌పై నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు రాయపాటి సాంబశివరావు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రావు శ్రీ కృష్ణదే వరాయలు చేతిలో ఓడిపోయారు. వయోభారం కారణంగా తను తప్పుకుని కొడుకుని రాజకీయాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు రాయపాటి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనే కొడుకు రంగారావు కోసం గుంటూరు వెస్ట్‌ లేదా సత్తెనపల్లి అసెంబ్లీ స్థానాలు అడిగినప్పటికీ.. చంద్రబాబు అంగీకరించలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీపై అసంతృప్తితో ఉంది రాయపాటి ఫ్యామిలీ. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కొడుకుని చట్టసభల్లో చూడాలని భావిస్తున్నారు రాయపాటి సాంబశివరావు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో భవిష్యత్ కష్టమని భావించిన రాయపాటి ఫ్యామిలీ.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించింది.

గుంటూరు జిల్లాలో రాయపాటి ఫ్యామిలీకి మంచి బలం ఉంది. గుంటూరు పార్లమెంట్ పరిధిలోనూ, నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోనూ రాయపాటికి పెద్ద ఎత్తున అనుచరగణం ఉంది. తెలుగుదేశంతో పాటు వైసీపీ నేతలతోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి. రాయపాటి రాజీనామా గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చే అంశమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  12 Jan 2024 12:29 PM GMT
Next Story