ఏపీలో గిరిజనుల మాటలు వినే ప్రభుత్వం ఉంది.. - మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్
టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, కానీ సీఎం జగన్ రెండు మంత్రివర్గాల్లోనూ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారని నేతలు చెప్పారు.
అడవులకే పరిమితం అనుకున్న గిరిజన బిడ్డలను ఏపీ సీఎం జగన్ రాజకీయ రంగంలో కూడా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనుల మాట వినే ప్రభుత్వం ఉందని, దాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదివారం విజయవాడలో నిర్వహించిన ‘గిరిజన శంఖారావం’ సభలో వారు మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ గిరిజనులకు అత్యధికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయడం గొప్ప విషయమన్నారు. ఏపీలో గిరిజనులకు జరుగుతున్నంత సంక్షేమం. అభివృద్ధి దేశంలో మరెక్కడా అందడం లేదని చెప్పారు. అందుకే ఏపీలోని గిరిజనులు జగన్ ను అభిమానిస్తున్నారని తెలిపారు.
టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, కానీ సీఎం జగన్ రెండు మంత్రివర్గాల్లోనూ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారని నేతలు చెప్పారు. ఎమ్మెల్సీలుగా గిరిజనులకు అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థులను గెలిపించుకొని మరింతగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.