పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోంది.. - మాజీ ఎంపీ హరిరామజోగయ్య
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనకు పొత్తులో భాగంగా 50 అసెంబ్లీ సీట్లు, 6 ఎంపీ సీట్లు కేటాయించాలని హరిరామజోగయ్య తన లేఖలో స్పష్టంచేశారు.
మాజీ ఎంపీ హరిరామజోగయ్య హాట్ హాట్ కామెంట్లతో తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీని యాచించే స్థితిని జనసేన కార్యకర్తలు కోరుకోవడం లేదని ఆయన ఆ లేఖలో స్పష్టంచేశారు. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి ఏమిటనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనూ ఆయన ఈ అంశంతో ఓ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విడుదల చేసిన లేఖలో ఆయన సీట్ల విషయంపై తన అభిప్రాయాన్ని తేల్చిచెప్పారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనకు పొత్తులో భాగంగా 50 అసెంబ్లీ సీట్లు, 6 ఎంపీ సీట్లు కేటాయించాలని హరిరామజోగయ్య తన లేఖలో స్పష్టంచేశారు. 20 లేదా 30 సీట్లు మాత్రమే ఇస్తే పవన్ ఆశయాలకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. 2019లో ఓడిపోయిన జనసేన పార్టీ నేతలు ఇప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. జనసేనకు తక్కువ సీట్లు ఇస్తే తమను నిరాశపరిచినట్టేనని ఆయన స్పష్టం చేశారు.