Telugu Global
Andhra Pradesh

చివరి శ్వాస వరకు జగన్‌ వెంటే ఉంటా..

కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు వారాలైనా ఇప్పటివరకు ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే ఎన్నికల్లో చెప్పిన హామీలను ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోందన్నారు.

చివరి శ్వాస వరకు జగన్‌ వెంటే ఉంటా..
X

తన చివరి శ్వాస వరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటానని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని తేల్చిచెప్పారు. శ్రీకాకుళంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం కక్షసాధింపే లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తే బెదిరిపోనని, రాష్ట్రంలో ఎక్కడైనా తాను సెంటు భూమి ఆక్రమించానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాలు విసిరారు. టీడీపీ వారు గతంలో తనపై ఐదు ఎఫ్‌ఐఆర్‌లు వేశారని, ఈ 15 రోజుల్లో ఒక ఎఫ్‌ఎస్‌ఐఆర్‌ నమోదు చేశారని ఆయన చెప్పారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలను ఎగ్గొట్టేలా ఉన్నారు

కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు వారాలైనా ఇప్పటివరకు ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే ఎన్నికల్లో చెప్పిన సూపర్‌ సిక్స్‌ హామీలను ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకోకపోతే ప్రజల తరఫున వైసీపీ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. పథకాల అమలుకు జగన్‌ అప్పులు చేశారని ప్రభుత్వంలో కీలక వ్యక్తులు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో రూ.50 వేల కోట్ల అప్పులు చేస్తే టీడీపీ హయాంలో పథకాల అమలుకు రూ.లక్షన్నర కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం శ్రీలంక ఆయిపోతుందన్నవారే సూపర్‌ సిక్స్‌ పథకాలు ఎలా ఇస్తామంటున్నారని ప్రశ్నించారు. సంపద సృష్టించి ప్రజలకు పథకాలు ఇస్తానన్న మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలన్నారు. అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు.

రైతులకు నేటికీ అందని డబ్బులు..

వైసీపీ హయాంలో వ్యవసాయ సీజన్‌లో మే నాటికే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమయ్యేవని, చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదని, ఇవెప్పుడు వేస్తారని మాజీ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాల శిలాఫలకాలు ధ్వంసం చేయడం మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. పాఠశాలలు ప్రారంభమైనా అమ్మ ఒడి 30 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వలేదని తెలిపారు. కాలేజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు వేయాలన్నారు. విద్యా దీవెనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడకపోవడం దారుణమన్నారు. మత్స్యకారుల కష్టాలు తెలుసునని చెబుతున్న మంత్రి అచ్చెన్నాయుడు వారి డబ్బులు వారి ఖాతాల్లో వేయాలన్నారు. చేయూత సొమ్ముపై పవన్‌ చొరవ తీసుకోవాలని చెప్పారు. మహిళలకు వైఎస్సార్‌ చేయూత సొమ్ము తమ ప్రభుత్వంలో సుమారు రూ.5,065 కోట్లు డిపాజిట్‌ చేస్తే రూ.2,900 కోట్లు మహిళల ఖాతాల్లోకి వెళ్లాయన్నారు. ఇంకా సుమారు రూ.2,100 కోట్లు పెండింగులో ఉన్నాయని చెప్పారు. పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంంట్‌ శాఖలు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు, సెర్ప్‌ వేరే మంత్రికి ఇచ్చారన్నారు. ఇప్పడు చేయూత పెండింగ్‌ నిధులపై ఎవరు దృష్టి పెడతారని ప్రశ్నించారు.

First Published:  28 Jun 2024 10:57 AM IST
Next Story