Telugu Global
Andhra Pradesh

ఇంత చిన్న లాజిక్‌ మిస్సయితే ఎలా ‘తమ్ముళ్లూ’..

రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న సామెత మాదిరిగా చంద్రబాబు పాపపు సొమ్మంతా లాయర్ల పాలు అవుతోందని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

ఇంత చిన్న లాజిక్‌ మిస్సయితే ఎలా ‘తమ్ముళ్లూ’..
X

కక్ష సాధింపుతోనే చంద్రబాబును జైలులో పెట్టారంటూ టీడీపీ నిత్యం వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు రిమాండ్‌ ఖైదీగా జైలు గోడల మధ్యన ఉంటే దానికి, ప్రభుత్వానికి సంబంధమేంటని ప్రశ్నించారు. చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిందని, ఈ కేసులో అంతకుముందే ఈడీ, జీఎస్టీ, ఆదాయపన్ను శాఖ విచారణ చేపట్టి అవినీతి జరిగిందని తేల్చిన తర్వాతే సీఐడీ తన విచారణను చేపట్టిందని గుర్తుచేశారు. ఆ క్రమంలో సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే.. ఏసీబీ న్యాయస్థానం రిమాండ్‌ విధించిందని తెలిపారు.

బాబు కేసులు ఏసీబీ కోర్టుల్లో, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉన్నాయని, అక్కడ విచారణ సాగుతోందని వివరించారు. అసలు ఏ ఆధారాలూ లేకుండా బాబుని జైలులో ఎందుకు ఉంచుతారని ఈ సందర్భంగా నాని ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్‌ని మిస్సయితే ఎలా తమ్ముళ్లూ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. బాబు అపారమైన మేధస్సుతో గతంలోనే 19 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారని ఆయన తెలిపారు.

పాపపు సొమ్మంతా లాయర్ల పాలు..

రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న సామెత మాదిరిగా చంద్రబాబు పాపపు సొమ్మంతా లాయర్ల పాలు అవుతోందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఎంత మంది పెద్ద లాయర్లను తెచ్చి వాదించినా బాబుకు కేసులలో ఉపశమనం లభించకపోవడం వెనక కారణం టీడీపీ నేతలు ఆలోచించాలని ఆయన సూచించారు. ఏ ఆధారాలు లేకుండా బాబుని జైలులో ఎందుకు ఉంచుతారని ప్రశ్నించారు. కనీసం ఒక్క కంప్యూటర్‌ కూడా బిగించకుండా డబ్బులు ఇప్పించి హవాలా రూపంలో డబ్బులు తెచ్చి కిలారు రాజేష్‌కి, బాబు పీఏ శ్రీనివాస్‌కి ఇచ్చినట్టు ఆదాయ పన్ను శాఖ తెలిపిందని ఆయన గుర్తుచేశారు. వాస్తవాలు అన్నీ ఇలా ఉంటే చంద్రబాబు మీద వైసీపీ కక్ష అంటూ టీడీపీ నేతలు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు.

First Published:  18 Oct 2023 7:45 AM IST
Next Story