ఆ సర్వే చేసింది టీడీపీ జీతగాడే..
సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ అనే సంస్థ చేపట్టిన సర్వేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని.
దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల గ్రాఫ్ ఎలా ఉంది అంటూ సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ అనే సంస్థ చేపట్టిన సర్వేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆ సర్వే ఫలితాల్లో సీఎం జగన్ కి 20వ స్థానం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. జగన్ గ్రాఫ్ తగ్గించడం ఎవరి తరం కాదని చెప్పారాయన. జగన్ అంటే ఏంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని, బూటకపు సర్వేలు ఆయనపై పని చేయవని అన్నారు. టీడీపీని కాపాడుకునేందుకు ఆ పార్టీ చేయించిన సర్వే అది అని మండిపడ్డారు నాని. ఆ సర్వే సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదేనని చెప్పారు.
ముందు ముందు మరిన్ని వస్తాయి..
టీడీపీ గ్రాఫ్ పడిపోతోందని, దాన్ని పెంచుకోడానికి మున్ముందు ఇలాంటి చెత్త సర్వేలు, డబ్బా సర్వేలు ఎల్లో మీడియా తెరపైకి తెస్తుందని చెప్పారు పేర్ని నాని. వైసీపీ ప్లీనరీ తర్వాత.. జనం అంతా జగన్ వైపు ఉన్నారని వాళ్లకి తెలిసిపోయిందని, జోరువాన, ప్రతికూల పరిస్థితుల్లోనూ చాలా మంది గుంటూరు వద్ద వాహనాలు ఆపి నడుచుకుంటూనే ప్లీనరీకి హాజరయ్యారని చెప్పారు నాని. ప్లీనరీ దిగ్విజయంగా జరగడం చూసిన తండ్రీకొడుకులకు లాగులు తడుసిపోయాయని, అందుకే తన జీతగాళ్లతో ఇలాంటి డూప్లికేట్ సర్వేలు చేయిస్తున్నారని, ఆ సర్వేల చూసి టీడీపీ వాళ్లు ఆనందపడిపోతున్నారని ఎద్దేవా చేశారు.
దత్త పుత్రా ప్రవచనాలు తగ్గించు..
వైసీపీ ప్లీనరీతో దత్తపుత్రుడికి మతి చలించిపోయి రాజకీయ ప్రవచనాలు మొదలు పెట్టారంటూ పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు నాని. పవన్ కల్యాణ్ ద్వారా టీడీపీ వారు గ్రాఫ్ పెంచుకోవాలని చూశారని, అది సాధ్యం కాలేదని చెప్పారు. రాజకీయాల్లో పవన్ వేసే ప్రతి అడుగూ చంద్రబాబుకు ఏదో విధంగా బలం చేకూర్చేందుకేనని అన్నారు. పవన్ కల్యాణ్ మార్చే రంగుల ముందు ఊసరవెల్లి కూడా చిన్నబోతుందని ఎద్దేవా చేశారు. బాబు, పవన్‌ల ఏడుపులను, ప్రవచనాలను జనం నమ్మరని పేర్ని నాని చెప్పారు.
ఇంతకీ ఏంటా సర్వే..?
సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ అనే సంస్థ ఇటీవల దేశంలోని ముఖ్యమంత్రుల సామర్థ్యంపై ఓ సర్వే చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో 25మంది సీఎంల ప్రజాదరణపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ స్థానంలో, ఏపీ సీఎం జగన్ 20వ స్థానంలో ఉన్నట్టు తేల్చారు. ఈ సర్వే టీడీపీ అనుకూల మీడియాలో ప్రముఖంగా కనపడుతోంది. ఇది తప్పుడు సర్వే అని, అది టీడీపీ జేబు సంస్థ అంటూ వైసీపీ కౌంటర్లు ఇస్తోంది.