Telugu Global
Andhra Pradesh

పవన్ వారాహి వాహనానికి పసుపు రంగు వేయండి.. పేర్ని నాని సెటైర్

మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం సొంత వాహనాలకు ఆలీవ్ గ్రీన్ కలర్ వేయకూడదని, అలా వేస్తే వాహనం రిజిస్ట్రేషన్ కూడా కాద‌ని పేర్ని నాని అభిప్రాయ‌ప‌డ్డారు.

పవన్ వారాహి వాహనానికి పసుపు రంగు వేయండి.. పేర్ని నాని సెటైర్
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేపట్టనున్న రథయాత్ర కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కూడా సిద్ధం చేయించారు. తాజాగా ఆ వాహనం ఎలా ఉంటుందో తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా పవన్ వీడియోలు పంచుకున్నాడు. యుద్ధానికి వారాహి సిద్ధం..అనే టైటిల్‌తో వదిలిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే దీనిపై భారీగా ట్రోల్స్ కూడా వచ్చాయి.

జనసేన పార్టీ బాగా డబ్బున్న పార్టీ అని.. అందుకే కోట్లు ఖర్చుపెట్టి మిలటరీ ట్రక్కు లాగా ప్రచార రథాన్ని సిద్ధం చేశారని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశాయి. మా నాయకుడు జగన్‌కు అంత ఖర్చు అయ్యే వాహనాలు అవసరం లేదని పేర్కొన్నాయి. ఇక పవన్ వదిలిన వీడియోలో వారాహి వాహనం వెంట ఆర్మీ తరహాలో సెక్యూరిటీ సిబ్బంది నడవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. వాహనాన్ని కూడా అదేదో సినిమా టీజర్‌లాగా పరిచయడం ఏంటని సెటైర్లు వేశారు.

తాజాగా పవన్ వారాహి వాహనంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. యుద్ధం చేయడానికి వ్యాన్లు ఎందుకని.. ఎన్నికల్లో వాటితో యుద్ధాలు చేస్తారా.. అలా అయితే నేను కూడా అలాంటి వ్యాన్ ఒకటి కొనేవాడిని కదా.. అని సెటైర్ వేశారు. వారాహి అనే పేరుతో ఏదో వీడియో వస్తే ఇదేదో సినిమా టీజర్ అని అనుకున్నానన్నారు. వందల పుస్తకాలు చదువుతుంటా.. అని పవన్ చెబుతుంటారని, ఆయన ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ కూడా చదివితే బాగుంటుందని పేర్ని నాని సూచించారు.

చట్ట ప్రకారం సొంత వాహనాలకు ఆలీవ్ గ్రీన్ కలర్ వేయకూడదని, అలా వేస్తే వాహనం రిజిస్ట్రేషన్ కూడా అవదన్నారు. ఈ రంగుకు బదులుగా ముందే వాహనానికి పసుపు రంగు వేసుకుంటే ఖర్చు కూడా కలిసి వస్తుంది కదా.. అని పేర్ని నాని పవన్‌పై సెటైర్లు వేశారు. మొత్తానికి పవన్ వారాహి వాహనం ఆయన అభిమానులకు నచ్చినప్పటికీ.. సాధారణ జనానికి అంతగా రుచించ లేదు. ఎన్నికల ప్రచార రథం కోసం కోట్లు ఖర్చు పెట్టడం ఏంటని అభిప్రాయపడుతున్నారు. పవన్ ఇలా హంగామా చేయడం బదులు ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.

First Published:  8 Dec 2022 9:04 PM IST
Next Story