మళ్లీ జన్మభూమి కమిటీలు తెస్తానని చెప్పగలవా బాబూ?
చంద్రబాబు తాను నమ్మిన జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకువస్తానని చెప్పకుండా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న వలంటీర్ల వ్యవస్థను తాము అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తామని చెబుతున్నాడంటే.. జగన్ ముందుచూపు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలులోకి తెచ్చిన పథకాలనే తానూ కొనసాగిస్తానని చెబుతున్నాడని మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. చంద్రబాబుకు అంతకుమించి గత్యంతరం కూడా లేదని ఆయన చెప్పారు. యువకుడైన వైఎస్ జగన్ ముందుచూపుతో అమలు చేస్తున్న పథకాలు ప్రజలను ఎంతగా ఆకర్షించాయో తెలియంది కాదని ఆయన వివరించారు. కాకినాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు తాను నమ్మిన జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకువస్తానని చెప్పకుండా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న వలంటీర్ల వ్యవస్థను తాము అధికారంలోకి వచ్చినా కొనసాగిస్తామని చెబుతున్నాడంటే.. జగన్ ముందుచూపు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇటీవల వలంటీర్ల గురించి, ఆ వ్యవస్థ గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎంత చులకనగా మాట్లాడారో, ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారో ప్రజలంతా విన్నారని, ఎప్పటికీ మరిచిపోరన్నారు. తాము అధికారంలోకి వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు తెస్తానని చెప్పగలవా బాబూ.. అంటూ ఆయన సవాల్ చేశారు.
చంద్రబాబు మరోసారి మోసకారి హామీలతో జనం ముందుకు వస్తున్నాడని, జనం అతని మాటలు నమ్మొద్దని మాజీ మంత్రి కన్నబాబు కోరారు. 2014లో ఇదే కూటమి సుమారు 600 హామీలు ఇచ్చి.. అవేమీ అమలు చేయని విషయం అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తుచేశారు. 2014లో సుమారు రూ.87 వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. బ్యాంకుల్లో ఉన్న మీ బంగారం నేనే విడిపిస్తానంటూ నమ్మబలికాడన్నారు. కానీ రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి.. మోసం చేశాడన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మాటతప్పి.. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో మోసగించే ప్రయత్నం చేశాడని తెలిపారు. బాబు వస్తే జాబు అన్నారని, 3 సెంట్లలో ఇళ్లు కట్టిస్తామని చెప్పాడని అవేవీ అమలు చేయలేదని ఆయన గుర్తుచేశారు. కొత్త ప్రభుత్వం జూన్ నెలలో వస్తుంటే ఏప్రిల్‌లో రూ.4000 పింఛన్ ఎలా ఇస్తారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. దీనిని బట్టే చంద్రబాబు నిబద్ధత ఏమిటో అర్థమవుతోందన్నారు.